Story Board: తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 24, 2025న జీవో నంబర్ 292 జారీ చేసింది. దీని ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. 27 పురపాలక సంస్థలు GHMCలో విలీనమయ్యాయి. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్ల నుంచి దాదాపు 2,050 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. జనాభా 1.34 కోట్లు దాటింది. ఇది భారతదేశంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా మారింది. సింగపూర్ కంటే మూడింతలు, మారిషస్ స్థాయి విస్తీర్ణం కలిగిన నగరంగా హైదరాబాద్ రూపొందింది. ఈ విస్తరణతో GHMCలో జోన్ల సంఖ్య 6 నుంచి 12కి, సర్కిళ్లు 30 నుంచి 60కి, వార్డులు 150 నుంచి 300కి పెరిగాయి. ఈ మార్పులు పరిపాలనను వికేంద్రీకరించి, సేవలను మెరుగుపరచడానికి ఉద్దేశించినవి. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అసమాన అభివృద్ధిని సరిచేయడమే దీని లక్ష్యం. విలీనమైన 27 పురపాలక సంస్థల్లో బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్-జిల్లెల్‌గూడ, బోడుప్పల్, పీర్‌జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్ వంటి 7 కార్పొరేషన్లు, పెద్ద అంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయంజల్, మణికొండ, నార్సింగి వంటి 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ విలీనం వల్ల రోడ్లు, మంచినీరు, పారిశుధ్యం, ఇళ్ల నిర్మాణం వంటి సేవలు ఒకే విధంగా అందరికీ అందుతాయి. అసమానతలు తొలగి, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం GHMC యాక్ట్, తెలంగాణ మున్సిపాలిటీల యాక్ట్‌లకు సవరణలు చేసి.. ఈ విస్తరణకు చట్టబద్ధత కల్పించింది. వార్డు డీలిమిటేషన్ ప్రక్రియలో 6000కు పైగా అభ్యంతరాలు వచ్చాయి. సహేతుకమైనవి పరిగణనలోకి తీసుకొని తుది నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మార్పులతో హైదరాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా మారనుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది. ఏకరూప పన్నులు, మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. అయితే కొందరు విమర్శకులు ఇది కేంద్రీకృత నియంత్రణకు దారితీస్తుందనీ, స్థానిక సంస్థల స్వయం ప్రతిపత్తి తగ్గుతుందని అభిప్రాయపడుతున్నారు. విస్తరణ తర్వాత జీహెచ్‌ఎంసీలో ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగింది. విలీన సంస్థల నుంచి వందల మంది రెగ్యులర్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు చేరారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 300 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇది హైదరాబాద్ పరిపాలనను మరింత సమర్థవంతం చేస్తుంది. ఈ విస్తరణ వల్ల హైదరాబాద్ భవిష్యత్తు నగరంగా మారనుంది. ఫ్యూచర్ సిటీ కూడా దీనికి త్వరలో జత కలిసే ఛాన్స్ ఉంటుంది. ప్రభుత్వం ఏకరూప అభివృద్ధి, మెరుగైన సేవలు, ప్రజల సౌకర్యం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ మార్పులు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను ప్రపంచ మ్యాప్‌లో మరింత ప్రముఖంగా నిలబెడతాయి. పరిపాలనా సౌలభ్యం, ఆర్థిక వనరుల సమీకరణ మెరుగవుతాయి.
సుమారు 2,050 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ మహానగరం ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించింది. కొత్తగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజి గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లు ఏర్పాటు చేశారు. ప్రతి 45 వేల మంది జనాభాకు ఒక వార్డు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసారు. గతంలో ఉన్న శేరిలింగంపల్లిజోన్ మొత్తం మారిపోయింది. కేవలం మియాపూర్, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు సర్కిళ్లను మాత్రమే చేర్చారు. విలీనమైన అమీన్‌పూర్, నార్సింగిలను కూడా చేర్చారు. జీహెచ్‌ఎంసీ విస్తరిస్తూ నిర్ణయించిన తర్వాత తుక్కుగూడ ప్రాంతవాసులు తమను చార్మినార్ జోన్‌లో చేర్చవద్దని, ఇలా వివిధ ప్రాంతాలవాసులు ఆందోళనకు దిగారు. అయితే ఆయా ప్రాంతాలవాసులకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేశారు. తుక్కుగూడవాసులను శంషాబాద్ జోన్ పరిధిలోకి తెచ్చారు.పాతబస్తీకి సంబంధించి ప్రస్తుతం మూడు జోన్లు చేశారు. అందులో గోల్కోండ, చార్మినార్, రాజేంద్రనగర్‌లున్నాయి. ఇందులో పూర్తిగా పాతనగరానికి చెందిన ప్రాంతాలే ఉన్నాయి. ఇక కుత్భుల్లాపూర్ జోన్‌లో అత్యధికంగా ఏడు సర్కిళ్లు ఉండగా, ఆ తర్వాత రాజేంద్రనగర్ జోన్‌లో ఆరు సర్కిళ్లున్నాయి. ఇక శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, గోల్కొండ, సికింద్రాబాద్, ఉప్పల్, మల్కాజిగిరి, చార్మినార్ జోన్లలో ఐదు సర్కిళ్లు ఉండగా, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్, శంషాబాద్‌లలో నాలుగు సర్కిళ్లున్నాయి.
వచ్చే ఏడాది జనవరి నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఒకసారి జనగణన మొదలైతే, తదుపరి రెండేళ్ల వరకు డివిజన్ల మార్పులు లేదా పునర్విభజన చేపట్టడం సాధ్యపడదు. ఈ సాంకేతిక ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని.. ప్రభుత్వం అత్యంత వేగంగా శివారు ప్రాంతాల విలీనాన్ని పూర్తి చేసి పునర్విభజన ప్రక్రియను కొలిక్కి తెచ్చింది. ఈ వ్యవస్థీకరణ కేవలం సౌలభ్యం కోసం మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో జీహెచ్‌ఎంసీని మూడు స్వతంత్ర మహానగరపాలక సంస్థలుగా విభజించాలనే ప్రభుత్వ దీర్ఘకాలిక వ్యూహానికి పునాదిగా కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రాథమిక ఆలోచన ప్రకారం.. మూసీ నదిని సరిహద్దుగా తీసుకుని నగర విభజన జరగనుంది. మూసీకి దక్షిణాన ఉన్న ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక కార్పొరేషన్‌గా దీనికి జీహెచ్‌ఎంసీ పేరునే కొనసాగించే అవకాశం ఉంది. ఉత్తరాన ఉన్న ప్రాంతాలను సికింద్రాబాద్, సైబరాబాద్ పేరుతో మరో రెండు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసే దిశగా కసరత్తు సాగుతోంది. ఈ చరిత్రాత్మక మార్పు ద్వారా నగరంలోని అన్ని ప్రాంతాలకు సమానంగా నిధులు కేటాయించడం, ట్రాఫిక్, వ్యర్థాల నిర్వహణ వంటి సమస్యలను స్థానికంగానే పరిష్కరించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. ఈ పునర్ వ్యవస్థీకరణ పూర్తి కావడంతో.. హైదరాబాద్ మహానగరం పాలనాపరంగా సరికొత్త రూపురేఖలను సంతరించుకోనుంది.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇక మహా.. మహా నగరంగా మారనుంది. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ స్థానంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్..హెచ్‌ఎంఆర్‌ను ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రీజనల్ రింగు రోడ్డు వస్తుండడంతో భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్‌ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 రెవెన్యూ గ్రామాలు ఉండనున్నాయి. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ విస్తీర్ణం 7,257 చదరపు కిలోమీటర్లు కాగా.. హెచ్‌ఎంఆర్ పరిధి 10,472.72 చదరపు కిలోమీటర్ల వరకూ విస్తరించనుంది. హెచ్‌ఎండీఏ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి జిల్లాలుండగా హెచ్‌ఎంఆర్‌లో వీటితో పాటు నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్ జిల్లాలు చేరనున్నాయి. హెచ్‌ఎండీఏ పరిధిలో రంగారెడ్డి జిల్లా మొత్తం ఉన్నప్పటికీ ..ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్న దృష్ట్యా.. 36 రెవెన్యూ గ్రామాలను హెచ్‌ఎంఆర్ నుంచి పురపాలకశాఖ అధికారులు మినహాయించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్‌లో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 533 రెవెన్యూ గ్రామాలుండగా.. అత్యల్పంగా నాగర్‌కర్నూల్ జిల్లాలో మూడు మాత్రమే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో రెవెన్యూ గ్రామాలు ఇప్పటికే హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండగా.. వాటికి అదనంగా కొత్త గ్రామాలు కలిశాయి. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఒకే నగరమనే ప్రక్రియ అంచెలంచెలుగా జరుగుతోంది. సెప్టెంబరు 2, 2024లో ఆర్డినెన్స్ ద్వారా 51 గ్రామ పంచాయతీలను ప్రభుత్వం చుట్టు పక్కలున్న పట్టణ స్థానిక సంస్థల్లో విలీనం చేసింది. ఇప్పుడు 27 పట్టణ పాలక సంస్థలు జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి. తద్వారా ఔటర్ పరిధిలో ఏకరీతిన పాలనా సాగించటానికి మార్గం సుగమమైంది.
హైదరాబాద్లో నిజాం నవాబుల పాలన నుంచి ఇప్పటివరకూ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. 55 చ.కి.మీ విస్తీర్ణంతో మొదలైన ఈ మహానగరం అభివృద్ధి ప్రణాళిక నేడు 2 వేల 50 చదరపు కిలోమీటర్లకు విస్తరించిందంటే ఏ స్థాయిలో విస్తీర్ణం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాలన్నింటినీ తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌గా పేర్కొంటూ ఒకే గొడుకు కింద అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. నిజాం ప్రభుత్వం 1869లో పురపాలక వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. అప్పట్లో హైదరాబాద్ జనాభా 3.5 లక్షలు దాని విస్తీర్ణం 55 చదరపు కిలోమీటర్లు ఉంది. 1933లో హైదరాబాద్ నగరపాలక సంస్థ ..ఎంసీహెచ్ ఏర్పాటు చేశారు. 1950లో సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. 1955లో హైదరాబాద్, సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను ఒకటిగా చేసి ఎంసీహెచ్ చట్టం-1955ను అమల్లోకి తీసుకొచ్చారు. 2007లో రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని 12 మున్సిపాల్టీలు, 8 గ్రామ పంచాయతీలను హెచ్‌ఎంసీలో విలీనం చేసి జీహెచ్‌ఎంసీని ఏర్పాటు చేశారు. 2019లో జీహెచ్‌ఎంసీ పరిధిని ఆరు జోన్లు, 150 డివిజన్లుగా విభజించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 650చ.కి.మీ. ఉంది. ఇప్పుడు శివారులోని మున్సిపాల్టీలను విలీనంతో.. నగర విస్తీర్ణం 2 వేల 50చ.కి.మీలకు పెరుగుతుంది. విలీనమయ్యే ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్‌గా వ్యవహరిస్తున్నారు. విలీనంతో మాస్టర్ ప్లానింగ్, రవాణా కనెక్టివిటీ తదితర మౌలిక వసతులు మెరుగవడంతోపాటు ఆ ప్రాంతం వరకు ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చి అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇంకా, ట్రాఫిక్ పరంగా, పర్యావరణపరంగా ఒత్తిడి తగ్గుతుంది. సమర్థమైన విపత్తు నిర్వహణ సాధ్యమవుతుంది. పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. రోడ్లు, పారిశుద్ధ్యం, నీటిసరఫరా తదితర సదుపాయాలు అందరికీ సమానంగా అందుతాయి. పరిపాలన సామర్థ్యం, డిజిటల్ గవర్నెన్స్ మెరుగవుతాయి. ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం, పట్టణ ప్రణాళిక ఒకే గొడుగు కిందకు వస్తుందని అంచనా వేస్తోంది. అదే సమయంలో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా కొత్త ఊపు వస్తుందని చెబుతున్నారు. ఇటీవలే కోకాపేటలో ఎకరం రూ.137 కోట్లు పలికిన తరుణంలో.. మెగా హైదరాబాద్ ప్లాన్‌పై రియల్టర్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్‌కు సంబంధించి దేశంలో మరోసారి హైదరాబాద్ హాట్ స్పాట్‌గా నిలవటానికి మెగా నగరం దోహదపడుతుందనే అంచనాలున్నాయి.
ఒకపుడు హైదరాబాద్ నగరం అంటే చార్మినార్.. ఉత్తరాన ఎస్.ఆర్. నగర్ వరకు పరిధి ఉండేది. దక్షిణాన చంద్రాయణ గుట్ట, తూర్పున రామంతపూర్, పశ్చిమాన మెహదీపట్నం వరకు హైదరాబాద్ లిమిట్ ఉండేది. దీన్ని ఎంసీహెచ్‌గా పిలిచేవారు. అపుడు హైదరాబాద్ నగరంలో 100 మంది కార్పోరేటర్లు ఉండేవారు. ఆ తర్వాత కార్పొరేటర్ల సంఖ్య 150కి పెరిగింది. హైదరాబాద్ మహా నగరాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ గా మార్చారు. అటు ఉప్పల్ నుంచి ఈసీఐఎల్, హయత్ నగర్, బాలాపూర్, శేరిలింగం పల్లి వరకు హైదరాబాద్ నగరం విస్తీర్ణం పెరిగింది. విలీన ప్రక్రియ ముగిశాక తెలంగాణ విస్తీర్ణంలో దాదాపు 40 నుంచి 45 శాతం గ్రేటర్ హైదరాబాద్ ఉండనుంది. ఐదు జిల్లాలు, 47 మండలాలు, 311 గ్రామాల పరిధిలో ఆరు పార్లమెంటు స్థానాలు, 28 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. మరోవైపు ఓఆర్‌ఆర్ వరకు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధ్యయనం ప్రారంభించింది.
జీహెచ్‌ఎంసీలో విలీనం కానున్న మునిసిపాలిటీల్లో శంషాబాద్, నార్సింగి, మేడ్చల్ పరిధి ఓఆర్‌ఆర్‌కు బయట 2-3 కి.మీ దూరం వరకు విస్తరించి ఉంది. ఇవి అవుటర్ రింగ్ రోడ్డు గ్రోత్ కారిడార్‌లో ఉండడంతో అక్కడ పట్టణీకరణ శరవేగంగా జరుగుతోంది. మిగతా ప్రాంతాల్లో ఇంత వేగంగా పట్టణీకరణ లేదు. పైగా ఈ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి, పట్టణ ప్రణాళికలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పెరుగుతున్న పట్టణీకరణ ఒత్తిడిని, వనరుల పంపిణీలో అసమానతల వల్ల మౌలిక వసతుల కల్పనలో ప్రాంతాల మధ్య సమతుల్యత లోపించటాన్ని ప్రభుత్వం గుర్తించింది. మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఒకేతరహా అభివృద్ధి ప్రణాళికను అమలు చేసేదిశగా విలీన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం, అస్తవ్యవస్త కాలనీల ఏర్పాటును నిలువరించడం, జనాభా ఒత్తిడిని అధిగమించడం, విపత్తుల నిర్వహణను సులభతరం చేయడం, అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు తయారు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఓఆర్‌ఆర్ వరకు మెట్రోపాలిటన్ ప్రణాళికలను అమలుచేసే దిశగా విలీన ప్రక్రియను చేపట్టిన జీహెచ్‌ఎంసీ విస్తరణతో ఓఆర్‌ఆర్ అవతలి ప్రాంతాలకు కూడా హైదరాబాద్ ప్రధాన కేంద్రంలో ఉన్న సౌకర్యాలు లభించనున్నాయి. తాగునీటి నిర్వహణలో వాటర్‌బోర్డు ప్రస్తుతం ఔటర్ లోపలి ప్రాంతాల్లో ముఖ్య భూమిక పోషిస్తోంది. ఇకపై ఓఆర్‌ఆర్ అవతల ఉన్న కొన్ని ప్రాంతాలకు కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, ఇతర పనులను జీహెచ్‌ఎంసీ చూసుకోనుంది. ఇప్పటికే విలీనమైన కార్పొరేషన్లు, మున్సిపాల్టీల కార్యాలయాలన్నీ జీహెచ్‌ఎంసీలో సర్కిల్, జోనల్ కార్యాలయాలుగా మారాయి. ఇకపై అంతా ఒకే విధమైన జీహెచ్ఎంసీ తరహా పన్నుల విధానమే ఉంటుంది.
విస్తరణ తరుణంలో జీహెచ్‌ఎంసీ మినీ తెలంగాణగా మారనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం కోటికి పైగా జనాభా ఉంది. విస్తర ణతో మహా హైదరాబాద్ ఏర్పాటైంది. ఈ విస్తరించి నగరంలో పాతికేళ్లలో జనాభా 2.5 కోట్లకు పెరగనుంది. ఏటా 5 నుంచి 6 లక్షల మంది పెరిగినా.. కూడా జనాభా పెరుగుదల ఖాయమే. అంటే రాష్ట్ర మొత్తం జనాభాలో దాదాపు సగం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంటుంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్ 8 వేల కోట్లు దాటగా.. విస్తరణతో రూ.15 వేల కోట్లు దాటే అవకాశాలున్నాయి. మొత్తంగా మహా హైదరాబాద్ రాబోయే యాభయ్యేళ్ల అవసరాలను తీర్చే సామర్థ్యం సొంతం చేసుకుంటుదని భావిస్తున్నారు. తద్వారా నివాసయోగ్య ప్రాంతాల విస్తీర్ణం కూడా పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తు పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా ప్లాన్ చేయటానికి వీలుంటుంది. మహా హైదరాబాద్‌లో నివాస, పారిశ్రామిక ప్రాంతాల్ని మరోసారి వర్గీకరించి.. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రూపకల్పన చేస్తామని సర్కారు చెబుతోంది.
ప్రస్తుతం మహా హైదరాబాద్ తో సగం పని పూర్తైంది. అందుకు తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించినప్పుడే పూర్తిగా పని అయ్యిందని అనుకోవచ్చు. ముఖ్యంగా రోడ్లు , డ్రైనేజీ, సీనరేజీ , డ్రింకింగ్ వాటర్ , అండర్ గ్రౌండ్ పవర్ ఇవన్నీ మెరుగ్గా ఇవ్వగలిగితే భవిష్యత్తులో హైదరాబాద్ ను కొట్టే నగరం మరోటి ఉండదు. దీనికి తోడు ఇక్కడి వాతావరణం హైదరాబాద్ కి మరింత అడ్వాంటేజ్ అవుతుంది. అందువల్ల పెట్టుబడులు రావడానికి, కంపెనీలు రావడానికి కూడా హైదరాబాద్ కే అవకాశలెక్కువ. దేశంలో మిగతా నగరాలన్నీ ఏదో ఒక సమస్యతో సతమతమౌతున్నాయి. ఢిల్లీకి పొలుష్యన్ , బెంగళూరుకి ట్రాఫిక్, తాగునీరు సమస్య, చెన్నైకి వాతవారణం, తాగునీరు సమస్య.. ముంబై, కోల్ కతాకి జనాభా సమస్య. ఈ నగరాలతో పోలిస్తే.. 360 డిగ్రీల్లో భూమి ఉన్నది, ఎక్స్ పాన్షన్ కు అవకాశం ఉన్నది ఒక్క హైదరాబాద్ కే . ఈ అవకాశాన్ని సద్వినియగం చేసుకోగలిగితే.. మెగా సిటీ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది. పనిలోపనిగా మహా హైదరాబాద్‌లో భూముల రేట్లు పెరిగే అవకాశం కచ్చితంగా ఉంది. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే.. జీహెచ్ఎంసీలో విలీనం కావడం వల్ల ఆ ప్రాంతాలకు నగరపాలక సంస్థ హోదా లభిస్తుంది.. ఇది స్థిరాస్తి విలువను పెంచుతుంది. జీహెచ్ఎంసీ నిధులు, అభివృద్ధి ప్రణాళికలు అమలులోకి రావడం వల్ల మౌలిక వసతులు మెరుగుపడి, నివాసయోగ్యత పెరుగుతుంది. మెరుగైన మౌలిక వసతులు, పాలనా వ్యవస్థ కారణంగా ప్రజలు ఆ ప్రాంతాల్లో స్థిరనివాసం ఏర్పరచుకోవడానికి ఆసక్తి చూపుతారు.. తద్వారా స్థానిక భూముల డిమాండ్ పెరిగి రేట్లు పెరుగుతాయి. మొత్తంగా ప్రణాళికాబద్ధమైన మౌలిక వసతుల కల్పన బాధ్యతను ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే.. ఈ మహా హైదరాబాద్ పాలన గాడిలో పడి, స్థిరమైన అభివృద్ధిని సాధించగలదు. ఆ దిశగా ప్రభుత్వం, పౌరులు సమష్టి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది.
