NTV Telugu Site icon

Bihar Politics : శివసేన తరహాలో జేడీయూలో చీలికకు బీజేపీ ప్రయత్నించిందా..?

Bihar Politics

Bihar Politics

Bihar Politics :  మొన్న టీడీపీ.. నిన్న శివసేన.. ఇప్పుడు జేడీయూ..ఎన్డీఏకు మిత్రపక్షాలు ఎందుకు గుడ్ బై చెబుతున్నాయి..?
నితీష్ బీజేపీకి ఎందుకు దూరమయ్యారు..?బీహార్లో ఏం జరగబోతోంది..?కాషాయ పార్టీ వ్యూహమేంటి..?జాతీయ రాజకీయలపై ప్రభావం ఎంత..?
బీహార్ గేమ్

మహారాష్ట్రలో ముగిసిందనుకుంటే.. బీహార్ రాజకీయ సంక్షోభం తెరపైకి వచ్చింది. జేడీయూ అధినేత, రాష్ట్ర సీఎం నితీష్‌ కుమార్ ఎన్‌డీఏ కూటమికి గుడ్‌ బై చెప్పేశారు. గత కొన్నిరోజులుగా ఆయన బీజేపీకి దూరంగా అడుగులు వేస్తూ చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. 2019లో టీడీపీ, మొన్న శివసేన.. ఇప్పుడు జేడీయూ ఒక్కొక్కటిగా మిత్రపక్షాలు ఎన్డీఏకు దూరం కావడంప చర్చ జరుగుతోంది.

బిహార్‌ రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరాయి. సీఎం పదవికి నితీష్‌ కుమార్‌ రాజీనామా చేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది.

మొన్నటికి మొన్న శివసేనను చీల్చి.. మహారాష్ట్రలో విజయవంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది బీజేపీ. కానీ బీహార్లో మిత్రపక్షం హ్యాండివ్వడంతో ఉన్న ప్రభుత్వం పోయింది. శివసేన మాదిరిగా జేడీయూలోనూ చీలిక కోసం కాషాయా పార్టీ ట్రై చేస్తోందని గ్రహించే.. నితీష్ ముందే ఝలక్ ఇచ్చారనే వాదన వినిపిస్తోంది. బీహార్ సీఎం పదవికి నితీశ్ రాజీనామా చేశారు. 160 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న లేఖను కూడా గవర్నర్ కు ఇచ్చారు. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు నితీష్ కు మద్దతివ్వడానికి ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. తేజస్వి యాదవ్ కి డిప్యూటీ సీఎం పదవి, కాంగ్రెస్ కు స్పీకర్ పదవి ఇవ్వాని డీల్ కుదిరనట్టు సమాచారం.

బీహార్‌లో 2005 నుంచి 2013 వరకు బీజేపీ, జేడీయూ పొత్తు కొనసాగింది. బీజేపీ మద్దతుతో నితీశ్ రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 2013లో ఎన్డీయేని వీడిన నితీశ్ కుమార్ 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశారు. కానీ మహాకూటమిలో రెండేళ్లకే చీలిక వచ్చింది. తిరిగి 2017లో నితీశ్ మళ్లీ ఎన్డీయేతో జతకట్టారు. 2020లో బీజేపీతో కలిసే ఎన్నికల్లో పోటీ చేశారు. గతంలో ఎప్పుడూ జేడీయూ కన్నా ఎక్కువ సీట్లు సాధించని బీజేపీ.. ఈసారి ఆ పార్టీ కన్నా ఎక్కువ సీట్లు సాధించింది. అయినప్పటికీ నితీశ్‌ కుమార్‌కే సీఎం సీటును ఆఫర్ చేసింది.

గత కొన్నాళ్లుగా బీజేపీ తీరు పట్ల నితీశ్‌లో అసంతృప్తి రాజుకుంది. కేంద్ర కేబినెట్‌లో జేడీయూకి రెండు బెర్తులు ఇవ్వాలని నితీశ్ కేంద్రాన్ని కోరగా కేవలం ఒకరికే అవకాశం కల్పించారు. అది కూడా నితీశ్‌ను సంప్రదించకుండానే జేడీయూ నేత ఆర్‌సీపీ సింగ్‌ను కేంద్రమంత్రిని చేశారు. తమ పార్టీలో ఎవరిని కేంద్రమంత్రిని చేయాలనేది కూడా అమిత్ షానే నిర్ణయించడం నితీశ్‌ అవమానంగా భావించారు. ఈ క్రమంలో ఆర్‌సీపీ సింగ్‌కి నితీశ్ మరోసారి రాజ్యసభ అవకాశం కల్పించలేదు. పైగా ఆర్‌సీపీ సింగ్ బీజేపీ నేతలతోనే ఎక్కువ సఖ్యతగా మెలగడం ఆయనకు నచ్చలేదు. ఈ పరిణామాలన్నీ నితీశ్‌కు మహారాష్ట్ర రాజకీయాన్ని తలపించాయి. జేడీయూని చీల్చేందుకు బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందనే నిర్ణయానికి వచ్చారు. దీంతో బీజేపీతో మిత్ర బంధాన్ని తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

కొంతకాలంగా నితీష్ బీజేపీ పట్ల విముఖతను ప్రదర్శిస్తున్నారు. గతంలో కేంద్రం నిర్వహించిన కొన్ని సమావేశాలతో పాటు ఇటీవల జరిగిన నీతి అయోగ్ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. దీనికి గల కారణాలు కూడా బయటకు రాలేదు. బీజేపీ తన పార్టీని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు నితిష్ కుమార్ అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర‌లో శివసేన పరిస్థితి తన పార్టీకి రాకూడదనే నితిష్ ఈ స్టెప్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ టోటల్ ఎపిసోడ్‌పై ఇంకా బీజేపీ నుంచి ఎటువంటి స్పందన లేదు. కానీ ఓ మంత్రి మాత్రం నితిష్ కుమార్ యాక్షన్ బటి తమ రియాక్షన్ ఉంటుందని అన్నట్టు సమాచారం.

బీజేపీ నాయకత్వం తీరుపై తన అసంతృప్తిని నితీశ్‌ కుమార్‌ ఎక్కడా దాచుకోవడం లేదు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి, నియంత్రణ చర్యలపై ప్రధాని మోడీ కొన్ని రోజుల క్రితం ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో నితీశ్‌ పాలుపంచుకోలేదు. ఆదివారం మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ భేటీకి గైర్హాజరయ్యారు. జూలై 17న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశానికి దూరంగా ఉండిపోయారు.రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వీడ్కోలు పలుకుతూ జూలై 22న ప్రధాని మోడీ ఇచ్చిన విందుకు సైతం హాజరుకాలేదు. మూడు రోజుల తర్వాత నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవంలోనూ పాల్గొనలేదు.వీటితో పాటు కులాల వారీగా జనగణన, జనాభా నియంత్రణ, అగ్నిపథ్‌ వంటి కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో విభేదించారు.

బీహార్ ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల సమయం ఉంది. ఈ మూడేళ్లూ బీజేపీని కాచుకుని నితీష్ ప్రభుత్వాన్ని సజావుగా నడపగలరా అనే అనుమానాలు లేకపోలేదు. బీజేపీ కచ్చితంగా సైలంట్ గా ఉండదని.. మహారాష్ట్ర తరహాలో ప్రభుత్వాన్ని కూల్చడానికి అదును కోసం చూస్తుందని చర్చ నడుస్తోంది. గతంలో తేజస్వి యాదవ్ పై అవినీతి ఆరోపణలు చేసి పొత్తు తెంచుకున్న నితీష్.. ఇప్పుడు ఎలా ఆర్జేడీ మద్దతు తీసుకుంటారనే చర్చను బీజేపీ తెరపైకి తేవచ్చు. అయితే నితీష్ ముందు బీజేపీ పప్పులుడకవని జేడీయూ వర్గాలు అంటున్నాయి. ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

దేశవ్యాప్తంగా విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఏకత్వం కనిపించలేదు. ఇప్పుడు నితీష్ ఆర్జేడీతో పొత్తు పెట్టుకోవడం, కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో ఫోన్లో మాట్లాడటం.. చిన్న విషయంగా కొట్టి పారేసే అవకాశం లేదు. కచ్చితంగా బీహర్ పరిణామాల ప్రభావం జాతీయ రాజకీయాలపై ఉంటుందనే అభిప్రాయం ఉంది. సరికొత్త రాజకీయ పరిణామాలకు తెరతీసే అవకాశాలున్నాయి.

ఇటీవలి కాలంలో ఎన్డీఏ నుంచి ఒక్కొక్కటిగా మిత్రపక్షాలు బయటికొస్తున్నాయి. మిత్రులతో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో టీడీపీ నుంచి మొదలుపెడితే.. మహారాష్ట్రలో శివసేన, ఇప్పుడు బీహార్లో జేడీయూ కూటమికి గుడ్ బై చెప్పటంపై కమలనాథులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. కిందపడ్డా నాదే పైచేయి తరహా రాజకీయాలే దీనికి కారణమనే విమర్శలున్నాయి. అయితే ఎవర్ని ఎలా డీల్ చేయాలో తమకు తెలుసంటున్నారు బీజేపీ నేతలు.

2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేశాయి. జేడీయూకి తక్కువ స్థానాలే వచ్చినప్పటికీ మిత్ర ధర్మాన్ని పాటిస్తూ బీజేపీ నితీష్ కే ముఖ్యమంత్రి పదవిని అప్పగించింది. అయితే, కొంతకాలంగా బీజేపీ, జేడీయూ మధ్య దూరం పెరిగింది. ఇందుకు కారణాలేంటి? బిహార్ రాజకీయం ఎలాంటి మలుపులు తిరగనుంది?

గతంలో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి జట్టు కట్టి బిహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయునేత నీతీశ్‌ కుమార్‌ కొంత కాలానికి బయటకు వచ్చి బీజేపీతో చేతులుకలిపారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపా, జేడీయు కలిసి పోటీ చేశాయి. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ 75 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆధిక్యం సాధించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో జేడీయుకు తక్కువ స్థానాలే వచ్చినప్పటికీ మిత్ర ధర్మాన్ని పాటిస్తూ బీజేపీ నితీష్ నే సీఎం చేసింది.

ప్రధాని మోడీ అధ్యక్షతన ఆదివారం దిల్లీలో జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశానికి నితీష్ గైర్హాజరయ్యారు. ఆరోగ్యం సరిగాలేదని చెప్పినప్పటికీ అదే రోజు పట్నాలో ప్రభుత్వ కార్యక్రమాలు రెండింటిలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సన్నాహాలపై జులై 17న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నిర్వహించిన ముఖ్యమంత్రుల భేటీకీ నితీష్ వెళ్లలేదు. పదవీ కాలం ముగిసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వీడ్కోలు పలికేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన విందుకు, మూడు రోజుల తర్వాత కొత్త రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం కార్యక్రమానికీ దూరంగా ఉన్నారు. అంతకుముందు దేశంలో కొవిడ్‌ పరిస్థితిపై ప్రధాని మోడీ నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశానికీ నితీష్ హాజరుకాలేదు.

అసెంబ్లీలో తమ కన్నా తక్కువ సీట్లున్న జేడీయునేతను సీఎం చేయడం వెనుక బిహార్‌లో తమ పార్టీని మరింత బలోపేతం చేసుకోవడమే కమలం నేతల అసలు లక్ష్యం. దీనిలో భాగంగా తనకున్న ప్రజాదరణను దెబ్బ తీసి ఏ క్షణమైనా తన సొంత ముఖ్యమంత్రిని తెరపైకి తీసుకువచ్చే యోచనలో బీజేపీ ఉందని నితీష్ అనుమానిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ఘటనలు నితీష్ అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. తరచూ తన ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా మాట్లాడుతున్న అసెంబ్లీ స్పీకర్‌ విజయ్‌కుమార్‌ సిన్హాను ఆ పదవి నుంచి తప్పించాలని నితీష్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా సఫలం కాలేకపోయారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం తర్వాత ప్రధాని మోడీ తన కేబినెట్‌లో జేడీయుకి ఒకే ఒక్క మంత్రి పదవిని ఇస్తామనగా.. నితీష్ తిరస్కరించారు. 2021లో మంత్రి వర్గాన్ని విస్తరించినప్పుడు తన అభీష్టానికి భిన్నంగా ఆర్సీపీ సింగ్‌కు పదవినిచ్చారు. ఆయన బీజేపీతో సన్నిహితంగా మెలగడం నితీష్ కు ఏ మాత్రం ఇష్టం లేదు. ఆర్సీపీ సింగ్‌ను మరోసారి రాజ్యసభకు పంపించడానికి ఆయన నిరాకరించారు.

2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయు ఓటమే లక్ష్యంగా అభ్యర్థులను నిలిపిన లోక్‌జనశక్తి అధ్యక్షుడు చిరాగ్‌ పాస్వాన్‌కు బీజేపీ పెద్దల ఆశీర్వాదం ఉందని నితీష్ బలంగా నమ్ముతున్నారు. ఇటీవల పట్నాలో బీజేపీ సమావేశంలో చిరాగ్‌ ప్రత్యక్షమయ్యారు. తన మంత్రి వర్గంలోకి బీజేపీ ఎమ్మెల్యేలను ఎవరిని తీసుకోవాలన్న స్వేచ్ఛ కూడా నితీష్ కు లేకుండాపోయింది. అధిక పదవులు కమలదళానికే దక్కాయి. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిలో తనను బీజేపీ కొనసాగనివ్వదనే అభిప్రాయానికి వచ్చారు నితీష్.

ప్రస్తుత పరిణామాలకు బీజేపీ స్వయంకృతాపరాధమే కారణమని విశ్లేషకులు అంటున్నారు. జేడీయూ జాతీయ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి ఆర్సీపీ సింగ్‌ పార్టీకి రాజీనామా చేయడంతో బీజేపీ-జేడీయూ బంధంలో బీటలు మరింత తేలతెల్లమయ్యాయి. నిజానికి ఆయనను కేంద్ర మంత్రిగా బీజేపీ ఏకపక్షంగా ఎంపిక చేసింది. ఆయన అమిత్‌షాకు దగ్గరవుతున్నట్లు గుర్తించిన నితీశ్‌.. ఈసారి రాజ్యసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదు. ముందు నుంచీ.. కేంద్ర సర్కారులో రెండు బెర్తులు కావాలని నితీశ్‌ కోరినా.. బీజేపీ పట్టించుకోవడం లేదు. దాంతో.. లోక్‌ జనశక్తి మాదిరిగా.. ఆర్సీపీ సింగ్‌ ద్వారా జేడీయూను చీల్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని నితీశ్‌ భావించారు. ఆర్సీపీ సింగ్‌ కూతురి అవినీతిపై నిలదీశారు. దీంతో.. ఆర్సీపీ సింగ్‌ రాజీనామా చేశారు. ఇక 2017లో లాలూ అవినీతిని ఎత్తిచూపుతూ.. సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగి, బీజేపీతో జతకట్టిన జేడీయూ.. 2020లో ఎన్డీయే తరఫున బరిలో దిగి.. భారీగా సిటింగ్‌ స్థానాలను కోల్పోయి, 43 సీట్లకు పరిమితమైంది. అదే సమయంలో 74 స్థానాలు సాధించిన బీజేపీ, నితీశ్‌కే అధికారాన్ని కట్టబెట్టింది. అయితే.. బిహార్‌పై పట్టుకు షా ప్రయత్నిస్తుండడంతో.. ఆర్సీపీ సింగ్‌ మరో ఏక్‌నాథ్‌ షిండేలా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని జేడీయూ చీఫ్‌ భావించారు. మరోవైపు.. మిత్రపక్షమే అయినా, రాష్ట్ర బీజేపీ నేతలు అడపాదడపా తనను టార్గెట్‌ చేయడం, ఇరకాటంలో పడేస్తుండడం నితీశ్‌కు కొత్త చికాకులు తెచ్చిపెడుతున్నాయి. దీంతో.. తెగదెంపులకు సిద్ధమయ్యారు.

నితీశ్‌ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నా, జేడీయూ ఎమ్మెల్యేలు మధ్యంతర ఎన్నికలకు సుముఖంగా లేరు. అందుకే పాత మిత్రులు ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో పొత్తు పెట్టుకొని అధికారాన్ని కాపాడుకోవాలని డిసైడయ్యారు. 243 స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీలో అధికారానికి 122 మంది సభ్యుల బలం అవసరం.రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 77 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేడీయూకు 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సంకీర్ణ స‌ర్కారులో ఉన్న మ‌రోపార్టీ హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM)కు న‌లుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక స్వతంత్ర ఎమ్మెల్యే కూడా ప్రభుత్వానికి మ‌ద్దతు ఇస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఆర్జేడీకి 75 స్థానాలు, కాంగ్రెస్ కు 19 స్థానాలు ఉండగా.. వామపక్షాలకు 16 సీట్లున్నాయి. ఈ నంబర్లు కలుపుకునే నితీష్ గవర్నర్ కు లేఖ ఇచ్చినట్టు తెలుస్తోంది.

బీహార్ రాజ‌కీయాలు మ‌రోసారి దేశ‌వ్యాప్తంగా చ‌ర్చనీయాంశ‌మ‌వుతున్నాయి.. చూడాలి ఏం జ‌రుగుతుందో.. ఎందుకంటే రాజ‌కీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చు అని ఇప్పటికే అనేక ఘ‌ట‌న‌లు నిరూపించాయి. నితీష్ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతిపక్షాల తరపున ప్రధాని అభ్యర్థిగా తెరపైకి వచ్చినా ఆశ్చర్యం లేదనే వాదన ఉంది.

బీహార్ పరిణామాలతో బీజేపీపై కొంత వ‌ర‌కు ప్రభావం ప‌డుతుంద‌నేది స్పష్టం. మొత్తంగా 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నితీశ్ కుమార్‌‌పై తీవ్ర విమర్శలు చేసిన బీహార్‌లో ఎన్డీయే కూటమికి చిరాగ్ పాశ్వాన్‌ దూరమయ్యారు. అయితే జాతీయ స్థాయిలో ఎన్డీయే కూటమిలో కొనసాగుతామని స్పష్టంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి తాను హనుమంతునికి చిరాగ్ పాశ్వాన్ అప్పట్లో వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయు అభ్యర్థులకు పోటీగా తమ పార్టీ అభ్యర్థులను చిరాగ్ పాశ్వాన్ బరిలో నిలిపారు. అయితే బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్న స్థానాల్లో మాత్రం పోటీగా దూరంగా ఉన్నారు. ఎల్జేపీ అభ్యర్థులు ఓట్లు చీల్చడంతోనే దాదాపు 30 స్థానాల్లో జేడీయు అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో చిరాగ్ పాశ్వాన్‌తో బీజేపీ సత్సంబంధాలను కొనసాగించడాన్ని జేడీయు తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ తర్వాతటి పరిణామాలతో చిరాగ్ పాశ్వాన్‌, బీజేపీ మధ్య సంబంధాలు క్షీణించాయి. చిరాగ్ పాశ్వాన్ చిన్నాన్న, ఎంపీ పశుపతి కుమార్ పరాస్ సారథ్యంలో ఐదుగురు ఎంపీలతో కూడిన చీలిక వర్గాన్ని అసలైన ఎల్జేపీ గుర్తించారు. తనపై పార్టీ నేతల తిరుగుబాటు వెనుక కొందరు బీజేపీ నేతల ప్రమేయం ఉందని అప్పట్లో చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు.

ఇప్పుడు బీహార్లో బీజేపీ రాజకీయం ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. లోక్ సభ ఎన్నికల పరంగా బీహార్ ను కీలక రాష్ట్రంగా చూస్తోంది బీజేపీ. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు.. రాబోయే ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయని నమ్ముతోంది. అందుకే ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉంది. కూటమికి గుడ్ బై చెప్పొద్దని నితీష్ కు నచ్చజెప్పడానికి బీజేపీ ఆఖరి నిమిషం వరకూ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే అమిత్ షా ఫోన్ కూడా నితీష్ పట్టించుకోలేదనే ప్రచారం జరుగుతోంది. మరిప్పుడు నితీష్ తో బీజేపీ ఎలా డీల్ చేస్తుంది.. అమిత్ షా ఎలాంటి వ్యూహాలు పన్నుతారనేది చూడాల్సి ఉంది.

జేడీయూతో పొత్తును అడ్డుపెట్టుకుని బీహార్లో బీజేపీ బలం పెంచుకుంది. రకరకాల వ్యూహాలతో నితీష్ వ్యక్తిగత ఇమేజ్ ను కూడా డ్యామేజ్ చేయాలని ప్లాన్ చేస్తోందనే ఆరోపణలున్నాయి. బీజేపీతో కొనసాగితే అసలుకు ఎసరు తప్పదనే.. నితీష్ ఎన్డీఏ నుంచి బయటికొచ్చారు. కానీ ఇంకా మూడేళ్లు పదవీకాలం ఉన్నందున.. దినదిన గండంగానే ఉంటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నితీష్ ను కేవలం ఓ మిత్రపక్ష నేతగా చూసే పరిస్థితి లేదు. ఆయన పేరు ప్రధాని అభ్యర్థుల్లో ఒకరిగా తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి. మమతా బెనర్జీ కంటే నితీష్ నాయకత్వానికి ఎక్కువ పార్టీలు జైకొట్టే అవకాశాలుంటాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే.. బీజేపీ వ్యూహం మార్చుకోవాల్సి రావచ్చు. భవిష్యత్తులో జరగబోయే అన్నిరకాల పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కాషాయ పార్టీ గేమ్ ప్లాన్ రచించాల్సి ఉంది.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతిచ్చిన నితీష్.. ఇంత త్వరగా నిర్ణయం తీసుకుంటారని బీజేపీ భావించిందా.. లేదా అనేది తేలాల్సిన అంశం. ప్రతిపక్ష శిబిరానికి మాత్రం ఇది ఊపునిచ్చే పరిణామమే. మరి బీహార్ పరిణామాల్ని వాడుకుని ఎవరు ఎంత రసవత్తర రాజకీయం చేస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటివరకు బీజేపీ నేతలు పదేపదే మహారాష్ట్ర, ఏక్ నాథ్ షిండే పేరు ప్రస్తావిస్తూ.. విపక్షాల్ని డిఫెన్స్ లో పడేస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు నితీష్ పేరు ప్రస్తావించి.. కౌంటర్లు ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే లోక్ సభ ఎన్నికలు బీహార్లో మోడీ వర్సెస్ నితీష్ గా మారే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఎవరి ఇమేజ్ ఏ మేరకు ఉందనేది తేలిపోతుంది.

దేశంలో ప్రాంతీయ పార్టీలను టార్గెట్ గా చేసుకుని, భార‌తీయ జ‌న‌తా పార్టీ రాజ‌కీయాలు కొన‌సాగుతూ ఉన్నాయి. మిత్ర‌ప‌క్షం అయినా, శ‌త్రుప‌క్షం అయినా.. తేడా లేకుండా ప్రాంతీయ పార్టీల్లో చీలిక‌లు తీసుకు వ‌చ్చి.. చీలిక వ‌ర్గాల‌ను అవ‌స‌రానికి త‌గ్గట్టుగా వాడుకునేలా ఉంది క‌మ‌లం పార్టీ. ఈ క్రమంలో బీజేపీ కొత్త టార్గెట్ నితీష్ కుమార్ అనే మాట వినిపిస్తూ ఉంది.
ఈ మ‌ధ్యకాలంలో రెండు ప్రాంతీయ పార్టీల అడ్రస్ ల‌ను మార్చేసింది బీజేపీ. అందులో ఒక‌టి బిహార్ లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ. రామ్ విలాస్ పాశ్వాన్ అనంతరం ఆయ‌న త‌న‌యుడికి సొంత బంధువులే ఝ‌ల‌క్ ఇచ్చారు. ఎల్జేపీలో తిరుగుబాటు రేగింది. ఆ తిరుగుబాటుకు క‌మ‌లం పార్టీ కావాల్సిన అండాదండా ఇచ్చింది. తిరుగుబాటు వ‌ర్గం ఇప్పుడు అస‌లు ఎల్జేపీగా చెల్లుబాటులో ఉంది. ఇక ఇన్నేళ్లూ త‌మ‌తో క‌లిసి సాగి, రెండుమూడేళ్ల కింద‌ట సీఎం సీటు విష‌యంలో పంతం వ‌చ్చి కాంగ్రెస్, ఎన్సీపీల‌తో చేతులు క‌లిపిన శివ‌సేన‌కూ ఇటీవ‌లే క‌మ‌లం పార్టీ షాక్ ఇచ్చింది. తిరుగుబాటు వ‌ర్గంలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మ‌నుగ‌డ‌లో ఉంది మ‌హారాష్ట్రలో.

ఈ ప‌రంప‌ర‌లో బీజేపీ కొత్త టార్గెట్ నితీష్ కుమార్ ఆధ్వ‌ర్యంలోని జేడీయూ అనే విశ్లేష‌ణ వినిపిస్తోంది. బిహార్ లో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిలో జేడీయూ చిన్న పార్టీనే. అయితే నితీష్ కే ముఖ్య‌మంత్రి పీఠాన్ని ఇచ్చి గౌర‌వించింది బీజేపీ. కానీ, ఇదంతా పైకి క‌నిపించేది అని, సీఎం సీట్లో ఉన్నా.. నితీష్ మాట ఏదీ చెల్లుబాటు కావ‌డం లేద‌ని, ఢిల్లీ క‌నుస‌న్నల్లోనే పాల‌న సాగుతోంద‌ని టాక్. అంతే కాదు.. చిరాగ్ పాశ్వాన్ కు ఝ‌ల‌క్ ఇచ్చిన రీతిలో నితీష్ కు కూడా క‌మ‌లం పార్టీ త్వరలోనే ట్రీట్ మెంట్ ఇవ్వబోతోంద‌ని విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. మ‌హారాష్ట్ర త‌ర్వాత క‌మ‌లం పార్టీ టార్గెట్ బిహార్ అని ఢిల్లీ నుంచి విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. అందుకే నితీష్ ముందే మేలుకున్నారని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతానికి బీజేపీ ఎత్తుకు నితీష్ పై ఎత్తు వేసినట్టు కనిపిస్తున్నా.. ఎండ్ గేమ్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది.