Storyboard : నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధం..? తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని సీట్లు పెరుగుతాయి..?
- 2027 జనగణన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం
- ఏపీ, తెలంగాణలో శాసనసభ స్థానాల పెంపుతో కొత్త రాజకీయ సమీకరణాల అవకాశం
- పట్టణ ఓటర్ల ప్రభావంతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మార్చే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Storyboard : తెలుగు రాష్ట్రాలు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు.. తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 153కు పెరిగే అవకాశాలున్నాయి. దేశంలో జన గణన 2027కి పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశ వ్యాప్తంగా లోక్‌సభ స్థానాలు.. శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన 11 ఏళ్ల తర్వాత రెండు రాష్ట్రాల శాసన సభల్లో స్థానాల పెంపునకు లైన్ క్లియర్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ 2014, మార్చి 1న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014ను కేంద్రం జారీ చేసింది. దీంతో 2014, జూన్ 2న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాజ్యాంగంలోని 170వ అధికరణలోని సెక్షన్ 15 ప్రకారం శాసనసభ స్థానాలను ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని విభజన చట్టం 2014లో సెక్షన్ 26(1) ద్వారా ఎన్నికల సంఘానికి కేంద్రం నిర్దేశించింది. విభజన చట్టం ప్రకారం 2019 నాటికే రెండు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం, కేంద్రం పూర్తి చేస్తాయని రాజకీయపార్టీలు ఆశిస్తూ వచ్చాయి. కానీ.. ఆ ఆశలు అడియాసలయ్యాయి.
జమ్మూ కశ్మీర్లో శాసనసభ స్థానాల పునర్విభజనకు 2022, మే 5న కమిషన్‌ను ఏర్పాటుచేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ శాసనసభ స్థానాలను పెంచేలా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో కె.పురుషోత్తం రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంపై కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు కోరింది. దేశంలో జన గణన ప్రక్రియ 2027లో పూర్తవుతుందని.. ఆ తర్వాతే విభజన చట్టంలో సెక్షన్ 26(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శాసనసభ స్థానాల పెంపునకు నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని స్పష్టం చేస్తూ అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్ సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఈ పిటిషన్‌పై తీర్పును ఏప్రిల్ 30న సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం రిజర్వు చేసింది.
Also Read
జన గణన ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న అంశం ఏపీ విభజన చట్టంలో ఎక్కడా లేదు. ప్రజల సౌకర్యం, పాలన సౌలభ్యం, భౌగోళికంగా సమస్యలు తలెత్తకుండా శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని మాత్రమే ఎన్నికల సంఘానికి విభజన చట్టం నిర్దేశించింది. కానీ.. కేంద్రం జన గణనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో శాసనసభ స్థానాల పునర్విభజనను ముడిపెట్టింది.
వాస్తవానికి దేశంలో జన గణన 2020లో ప్రారంభమై 2021 నాటికి పూర్తి కావాలి. కానీ.. 2020 ఫిబ్రవరి నుంచి 2022 వరకూ కరోనా మహమ్మారి మూడు విడతలుగా దేశ వ్యాప్తంగా ప్రబలింది. దీంతో జన గణనను అప్పట్లో కేంద్రం వాయిదా వేసింది. అంతలోనే 2024 సార్వత్రిక ఎన్నికలు ముంచుకు రావడంతో ఆ అంశం మరుగున పడింది. కొద్దిరోజుల క్రితం దేశంలో జనగణన పైన కేంద్రం గజెట్ జారీ చేసింది. కాగా.. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. దీంతో, ఇప్పుడు జనగణన పూర్తయిన తరువాత పెరిగే పార్లమెంట్ స్థానాల్లో మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది.
ఏపీలో లోక్ సభ స్థానాల సంఖ్య లో మార్పుల పైన జనగణన తరువాతనే స్పష్టత రానుంది. ప్రస్తుతం ఉన్న 25 లోక్ సభ స్థానాలను ఒక్కో జిల్లాగా మార్పు చేశారు. ఇదే కొనసాగితే.. ఇందులో దాదాపు ఆరు నుంచి ఎనిమిది వరకు ఎంపీ స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక, జనగణనతో పాటుగా కులగణన చేస్తుండటంతో… రిజర్వేషన్ శాతాల్లో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో.. ఎస్సీ – ఎస్టీ రిజర్వ్ స్థానాల సంఖ్య పెరగటం ఖాయమని భావిస్తున్నారు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు కొన్ని జనరల్ కావటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక.. పార్లమెంట్ కేంద్రంగా అసెంబ్లీ స్థానాలు రెండు వరకు పెరిగేలా పునర్విభజన చట్టంలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో మూడు పార్టీల కూటమికి సీట్ల పెంపు కలిసొచ్చే అంశంగా అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. కూటమి కలిసే ఉంటుందని.. సీట్లు గతంలో త్యాగం చేసిన వారికి ఈ సారి సీట్లు కేటాయింపుకు అవకాశం వస్తుందని చెబుతున్నారు. అదే విధంగా ప్రతిపక్ష వైసీపీ నేతలు సైతం సామాజికంగా బీసీ, ఎస్సీ వర్గాల సంఖ్య పెరగటం ఖాయమని.. ఆ దామాషా ప్రకారం సీట్ల కేటాయించాల్సిన అంశం తమకు కలిసి వచ్చేదిగా చెబుతున్నారు. నియోజకవర్గా ల పునర్విభజన లో సామాజిక సమీకరణాలు.. వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు.. గెలుపు అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి. 2009 లో చోటు చేసుకున్న పునర్విభజన ప్రక్రియ.. అదే ఏడాది జరిగిన ఎన్నికల గురించి ప్రస్తుతం పార్టీలు గుర్తు చేసుకుంటున్నాయి. దీంతో.. రాజకీయం గా ఈ నియోజకవర్గాల పునర్విభజన.. సీట్ల పెంపు ఏపీ పార్టీల భవిష్యత్ కు కీలకం కానుంది.
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం సమీప భవిష్యత్తులోనే మారనుంది. రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలో పట్టణ ప్రజలే నిర్ణయించే రోజులు రానున్నాయి. మొన్నటివరకు గ్రామీణ ప్రాంతాల ప్రజలే ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. కానీ సమీప భవిష్యత్తులో పరిస్థితులు మారబోతున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు పట్టణ ప్రాంత ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని మరీ నడుచుకోవాల్సిన రోజులు త్వరలోనే రానుంది. 2028లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ స్థానాల సంఖ్య 153కు చేరనున్నది. లోక్‌సభ స్థానాలు 17 నుంచి 25కి పెరిగే అవకాశం ఉంది. ఇందులో మహిళలకు 51 అసెంబ్లీ సీట్లు రిజర్వ్కానున్నాయి. అప్పుడు ఎన్నికల తీర్పును పట్టణ ప్రాంత ప్రజలు శాసిస్తారని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో పట్టణ జనాభా విపరీతంగా పెరుగుతోంది. ఉపాధి, విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం గ్రామీణం నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగాయి. తెలంగాణ నుంచే కాకుండా ఇతర ఉత్తర భారతం, ఈశాన్య రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్‌నుంచి ఇక్కడికి వలసలు పెరగడంతో పట్టణ ప్రాంత జనాభా విపరీతంగా పెరిగింది. ఈ ప్రభావం నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టంగా పడనుంది. తెలంగాణలో ప్రస్తుతం 45 శాతం పట్టణ జనాభా ఉన్నట్టుగా అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక పెద్ద ఎత్తున మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో పట్టణ జనాభా పెద్ద ఎత్తున పెరిగింది. ప్రభుత్వం ఔటర్లోపలి మున్సిపాలిటీలు, నగరాలు, గ్రామాలు అన్నింటినీ జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. దీంతో పట్టణ జనాభా మరింత పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పునర్విభజన నాటికి ఉండే జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని నియోజకవర్గాలను పునర్విభజన చేస్తారు. దీంతో అప్పటికి పట్టణ జనాభా 50 శాతం వరకు చేరుతుందని విశ్లేషిస్తున్నారు.
సమీప భవిష్యత్‌లో హైదరాబాద్‌ను అనుకుని ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలైన ఉమ్మడి రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని పట్టణాలతో కలిసి అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 40 దాటనుంది. వీటితో పాటు ఔటర్బయట 30 జిల్లా కేంద్రాలు ఉన్నాయి. ఇవి 30 సెగ్మెంట్లుగా ఏర్పాటు కానున్నాయి. ఇవే కాకుండా వరంగల్‌లో ఇప్పటికే రెండు పూర్తి పట్టణ నియోజకవర్గాలు ఉండగా పునర్విభజన నాటికి అవి మూడుకు చేరుకోనున్నాయి. జిల్లా కేంద్రాలు కాకుండా రామగుండం, మిర్యాలగూడ, హుజురాబాద్, సత్తుపల్లి, నర్సంపేట లాంటి పట్టణాలు సైతం నియోజకవర్గ కేంద్రాలుగా పట్టణ ప్రాంత ఓటర్ల ఆధిపత్యం కనపడనుంది. వీటితో పాటు ఆలేరు, తుంగతుర్తి, డోర్నకల్లాంటి నియోజకవర్గాల్లో రెండు చొప్పున మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తంగా జిల్లా కేంద్రాలు కాకుండా మరో 10 వరకు పట్టణ ప్రాంత ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండే నియోజకవర్గాలుగా మారనున్నాయి. ఇలా తెలంగాణలో మొత్తం 80కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు పట్టణ ప్రాంత ఓటర్ల డామినేషన్‌తో ఏర్పాటు కానున్నాయి.
తెలంగాణలో గ్రామీణ ప్రాంత ప్రజల అభిరుచులు, ఆలోచనలు ఒకలా ఉంటే.. పట్టణ ప్రాంత ప్రజల అభిరుచులు మరోరకంగా ఉంటాయి. ఒక్కోసారి ఈ రెండు ప్రాంతాల ప్రజలు పూర్తి భిన్నంగా ఎన్నికల ఫలితాలను ఇచ్చిన రోజులూ ఉన్నాయి. 2014లో ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైంది కానీ, ఆ పార్టీ హైదరాబాద్ చుట్టుపక్కల ఒకటి, రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. కానీ గ్రామీణ ఓటర్లు పట్టణ ఓటర్ల నిర్ణయానికి భిన్నంగా ఓటుతో తీర్పునిచ్చారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఇక్కడ సైతం గ్రామీణ ఓటర్లు పట్టణ ఓటర్ల ఆలోచనకు భిన్నంగా తీర్పునిచ్చారు. దీంతో రెండు ప్రాంతాల ప్రజల ఆలోచన భిన్నంగా ఉన్నాయనేది స్పష్టమైంది. ఈ తరుణంలో రాబోయే రోజుల్లో ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వనున్నారనేది ఆసక్తిగా మారింది.
మొత్తం మీద నియోజకవర్గాల పునర్విభజన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. సహజంగా అధికార పార్టీలకు అనుగుణంగా ప్రక్రియ జరుగుతుందనే అభిప్రాయాలున్నా.. ప్రతిసారీ ఆ లెక్కలు నిజం కావాలన్న రూలేం లేదు. ఏది ఏమైనా నియోజకవర్గాలు పునర్విభజన తర్వాత కొత్త రాజకీయ సమీకరణాలు.. అందుకు తగ్గట్టుగా సరికొత్త రాజకీయ వ్యూహాలు అవసరమౌతాయని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!