లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఓటమి చవిచూసిందన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే.. యుజ్వేంద్ర చాహల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. 10 ఓవర్లలో 47 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన ఈ భారత స్పిన్నర్.. 39 ఏళ్ల కిందట రికార్డును బద్దలుకొట్టాడు. 1983 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో మొహిందర్ అమర్‌నాథ్ విండీస్ నడ్డి విరచడంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 12 పరుగులే ఇచ్చి 3 వికెట్లు ఇచ్చాడు. లార్డ్స్ మైదానంలో ఓ భారతీయ బౌలర్ ప్రదర్శించిన అత్యుత్తమ ప్రదర్శనగా అది నిలిచిపోయింది. ఆ తర్వాత ఎవ్వరూ లార్డ్స్‌లో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేదు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత చాహల్ తన సత్తా చాటి.. ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసి, చరిత్ర తిరగరాశాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్, 49 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ బ్యాట్స్మన్లను కట్టడి చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. కానీ, బ్యాటింగ్ విషయంలోనే పూర్తిగా తేడా కొట్టేసింది. ఏ ఒక్కరూ నిలకడగా రాణించలేకపోయారు. ప్రధాన బ్యాట్స్మన్లైతే మరీ దారుణంగా నిరాశపరిచారు. దీంతో.. 146 పరుగులకే భారత్ కుప్పకూలింది. ఫలితంగా.. 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఇప్పటివరకూ లార్డ్స్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన భారత్.. నాలుగింటిలో విజయం సాధించి, మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఒక వన్డేలో మాత్రం ఫలితం తేలలేదు. అయితే, భారత్ ఓ ప్రమాదం నుంచైతే గట్టెక్కింది. లార్డ్స్‌లో భారత్ ఇప్పటివరకూ నమోదు చేసిన అత్యల్ప స్కోరు 132 మాత్రమే. రెండో వన్డేలో 146 పరుగులు చేసి, ఆ చెత్త రికార్డ్ నుంచి తప్పించుకుంది.