Site icon NTV Telugu

Yuvraj Singh: మ్యాచ్ సమయంలో అమ్మాయికి హాగ్, వివాదం.. అసలు విషయం చెప్పిన యువరాజ్!

Yuvraj Singh

Yuvraj Singh

భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ క్రికెట్ ఆడే రోజులలో ఎన్నో లింకప్ రూమర్లను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అప్పటి తరం క్రికెటర్లలో అత్యంత స్టైలిష్‌ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన యువరాజ్ వ్యక్తిగత జీవితం అప్పట్లో మీడియాకు హాట్ టాపిక్‌గా మారేది. పలువురు హీరోయిన్స్‌తో యువీ డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. తాజాగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నిర్వహిస్తున్న యూట్యూబ్ టాక్ షో ‘Serving it Up with Sania’లో పాల్గొన్న యువరాజ్.. తనపై వచ్చిన ఓ రూమర్‌ గురించి స్పందించాడు. ఓ రూమర్‌ మీడియా కారణంగా చాలా పెద్దదిగా మారిందని చెప్పుకొచ్చాడు.

యువరాజ్ సింగ్ మాట్లాడుతూ… ‘నాకు ఓ మేనేజర్‌ ఉండేది. సాధారణంగా కలిసినప్పుడు ఆమెకు హగ్ ఇచ్చేవాడిని. దాన్ని మీడియా వక్రీకరించి రాసింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో నేను ఓ అమ్మాయిని కలిసినట్లు కథనాలు అల్లారు. ఎవరినైనా కలిసినప్పుడు సాదారణంగా హగ్ ఇవ్వడం సహజం. కానీ దాన్ని మీడియా పూర్తిగా వేరేలా చూపించింది. క్రికెటర్లు, సెలబ్రిటీల జీవితాల్లో ఇలాంటి లింకప్ రూమర్లు సాధారణమే. మీడియా మాత్రం వ్యూస్ పెంచుకోవడం కోసం అనవసర వివాదాలను సృష్టిస్తుంది. నెగెటివ్ లేదా వివాదాస్పద కథనాలు లేకపోతే ప్రజలు వార్తలు చదవరని కొందరు భావిస్తారు. కానీ పాజిటివ్ స్టోరీస్ కూడా చాలా అవసరం. ఈ రోజుల్లో పాజిటివిటీ కంటే నెగెటివిటీనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు’ అని చెప్పాడు.

Also Read: T20 World Cup 2026: సూర్య, గంభీర్‌కు అదే పెద్ద తలనొప్పి.. రోహిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

యువరాజ్ సింగ్ 2000లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి.. 2019లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. తన కెరీర్‌లో భారత్ తరఫున 398 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 11,000కిపైగా పరుగులు చేశాడు. ఒకటిన్నర దశాబ్దాల కెరీర్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఎన్నో చిరస్మరణీయ రికార్డులు సృష్టించాడు. 2011 వన్డే వరల్డ్‌కప్‌లో యువరాజ్ పాత్ర చరిత్రాత్మకం అనే చెప్పాలి. ఒకే వరల్డ్‌కప్‌లో 300కిపైగా పరుగులు, 15 వికెట్లు సాధించిన తొలి ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. ఆ టోర్నీలో నాలుగు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులతో పాటు.. ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. యువరాజ్ తన కెరీర్‌లో 304 వన్డేలు, 58 టీ20లు, 40 టెస్టులు ఆడి.. మ్యాచ్ విన్నర్‌గా, భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఆటగాడిగా తన స్థానాన్ని లిఖించుకున్నాడు.

Exit mobile version