Site icon NTV Telugu

Womens World Cup: మరోసారి విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా

Australia Min

Australia Min

క్రికెట్ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా జట్టు మరోసారి తన సత్తా నిరూపించుకుంది. పురుషుల జట్టుతో తీసిపోని రీతిలో ఆస్ట్రేలియా మహిళల జట్టు కూడా వరుసగా టైటిళ్లు సాధిస్తోంది. న్యూజిలాండ్ వేదికగా ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 71 పరుగుల భారీ తేడాతో ఆసీస్ మహిళలు విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు భారీ స్కోరు సాధించింది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అలిస్సా హేలీ కేవలం 138 బంతుల్లోనే 170 పరుగులు చేసింది.

అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు 43.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటై దారుణ ఓటమిని చవిచూసింది. స్కివర్ 148 పరుగులతో ఒంటరి పోరాటం చేసింది. మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో ఆస్ట్రేలియా 71 పరుగుల తేడాతో గెలిచింది. ఆసీస్ బౌలర్లలో స్కూట్ 2 వికెట్లు పడగొట్టగా.. అలాన కింగ్, జెస్ జొనాసెన్ చెరో 3 వికెట్లు తీశారు. దీంతో ఆ జట్టు మహిళల వరల్డ్‌‌కప్‌ను ఏడోసారి గెలుపొందింది. కాగా ఆస్ట్రేలియా మహిళల జట్టు 12 సార్లు ప్రపంచకప్ ఆడగా అందులో ఏడు సార్లు కప్పు కొట్టడం విశేషం.

కాగా ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు ఇప్పటివరకు 19 ప్రపంచకప్‌లలో 12 సార్లు విశ్వ విజేతగా అవతరించింది. ఇందులో ఏడు వన్డే ప్రపంచకప్‌లు, ఐదు టీ20 ప్రపంచకప్‌లు ఉన్నాయి. 1978, 82, 88, 97, 2005, 2013, 2022లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లను, 2010, 2012, 2014, 2018, 2020లో టీ20 ప్రపంచకప్‌లు సొంతం చేసుకుంది. అటు ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ టీం ఐదు సార్లు వన్డే ప్రపంచకప్‌లు, ఒకసారి టీ20 ప్రపంచకప్ గెలిచింది. మొత్తంగా ఆ దేశం 18 సార్లు విశ్వ విజేతగా నిలిచింది.

https://ntvtelugu.com/11-years-back-team-india-creates-history-on-april-2nd/

Exit mobile version