NTV Telugu Site icon

Womens IPL: నేడే విమెన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీల ప్రకటన..రేసు నుంచి సీఎస్కే ఔట్

Ipl1

Ipl1

15 ఏళ్లుగా క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ఈ ఏడాది డబుల్ కిక్కిచ్చేందుకు రెఢీ అయింది. ఇప్పటికే పురుషుల లీగ్‌ ఫ్యాన్స్‌కు మజా ఇస్తుండగా ఈ ఏడాది మహిళల లీగ్‌ కూడా ప్రారంభంకానుంది. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న మహిళా క్రికెటర్లకు ఇది గొప్ప అవకాశమనే చెప్పవచ్చు. అయితే, బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చూస్తున్న విమెన్స్ ఐపీఎల్‌లో నేడు (జనవరి 25) కీలక ప్రక్రియ జరగబోతోంది. ఈరోజే విమెన్స్ ఐపీఎల్ టీమ్స్‌లను ప్రకటించనుంది. ఇప్పటికే కోట్లాది రూపాయలను ఆర్జిస్తూ ప్రపంచ క్రికెట్‌లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న బీసీసీఐ మరింత సంపన్నం కానుంది. ఇదివరకే టెండర్లను ఆన్‌లైన్‌లో ఉంచగా పలు సంస్థలు, వ్యక్తుల నుంచి బిడ్‌లను స్వీకరించిన బీసీసీఐ..నేడు ఈ లీగ్‌లో పాల్గొనబోయే ఐదు టీమ్స్‌ను ప్రకటించనుంది.

Pathan Review: పఠాన్ మూవీ రివ్యూ (హిందీ)

టెండర్ల స్వీకరణ ప్రక్రియ ఈనెల 21తో ముగిసింది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు ఐదు టీమ్స్ కోసం 33 బిడ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. వీరిలో పురుషుల ఐపీఎల్‌కు చెందిన పది ఫ్రాంచైజీలు టెండర్లను కొనుగోలు చేశాయి. అయితే మొత్తంగా ఇప్పటిదాకా టెక్నికల్ బిడ్స్‌ను దాఖలు చేసినవి మాత్రం 17 మాత్రమే. ఆన్‌లైన్‌లో టెండర్లను కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ టెక్నికల్ బిడ్స్ దాఖలు చేయలేదని సమాచారం. ఈ మూడు తప్ప మిగిలిన ఏడు ఫ్రాంచైజీలు పోటీలో ఉన్నాయి. మొత్తంగా 17 సంస్థలు టెక్నికల్ బిడ్స్‌ను సమర్పించగా.. వాటిలో 14 బిడ్స్‌కు బీసీసీఐ ఆమోదం కూడా తెలిపిందట. బోర్డు వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఐదు టీమ్‌లను కొనుగోలు చేసేందుకు ఏడు ఐపీఎల్ టీమ్స్‌తోపాటు హల్దీరామ్స్, శ్రీరామ్ గ్రూప్, అదానీ గ్రూప్, కొటక్, ఏపీఎల్ అపోలో, స్లింగ్ షాట్ రూట్ మొబైల్‌లు కూడా పోటీలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఐదు టీమ్స్‌కు గానూ ఒక్కో జట్టు సుమారు రూ.600 నుంచి రూ.800 కోట్ల వరకు ధర పలికే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బుధవారం ఫైనాన్షియల్ బిడ్‌ల దాఖలు ప్రక్రియ ముగిసిన తర్వాత బీసీసీఐ.. దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. ఈ వేలం ద్వారా బీసీసీఐ సుమారు రూ.3 వేల కోట్ల నుంచి రూ.4 వేల కోట్ల వరకు ఆర్జించే వీలుందని విశ్లేషకుల అంచనా.