ఒకప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ, మాజీ ఓపెనర్ విరేందర్ సెహ్వాగ్‌ల మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉండేవని తెగ ప్రచారాలు జరిగాయి. ముఖ్యంగా.. 2008లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తుది జట్టు నుంచి సెహ్వాగ్‌ను ధోనీ తొలగించినప్పుడు, ఆ ప్రచారాలు మరింత బలపడ్డాయి. కానీ.. అవన్నీ అవాస్తవాలేనని ఆ తర్వాత నిరూపితమైంది. అయితే, అప్పట్లో జరిగిన ఓ పరిణామం గురించి మాత్రం తాజాగా సెహ్వాగ్ పంచుకున్నాడు.
ధోనీ తనని అలా జట్టు నుంచి తొలగించినప్పుడు తాను రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నానని, కానీ సచిన్ టెండూల్కర్ అడ్డుకోవడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నానని సెహ్వాగ్ వెల్లడించాడు. ‘‘2008లో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు నా మదిలో రిటైర్మెంట్ ఆలోచన మెదిలింది. వన్డేల్లో పెద్దగా రాణించకపోయేసరికి ధోనీ నన్ను తుది జట్టు నుంచి తప్పించడంతో, వన్డే క్రికెట్ నుంచి వైదొలగాలని అనుకున్నా. టెస్టు క్రికెట్‌లో మాత్రమే ఆడాలనుకున్నా. కానీ, సచిన్ నన్ను అడ్డుకున్నాడు. ‘ఇది నీ జీవితంలో ఓ చెడు దశ, వెయిట్ చెయ్, ఈ పర్యటన తర్వాత ఇంటికెళ్లి ఏం చేయాలో బాగా ఆలోచించు, ఆ తర్వాతే నిర్ణయం తీసుకో’ అని సచిన్ సూచించాడు. ఆయన సలహా మేరకే తాను రిటైర్మెంట్ ప్రకటించలేదు’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
ఆటగాళ్ళు రెండు రకాలుగా ఉంటారని.. ఒకరు సవాళ్ళని ఇష్టపడేవారు, మరొకరు విమర్శల్ని పట్టించుకోనివారని సెహ్వాగ్ తెలిపాడు. సవాళ్ళని ఇష్టపడే వాళ్ళు విమర్శల్ని ఎంజాయ్ చేస్తూ, మైదానంలో పరుగుల ద్వారా వాటిని తిప్పి కొడతారని, అందుకు కోహ్లీని ఉదాహరణగా చెప్పుకోవచ్చని అన్నాడు. తాను మాత్రం రెండో రకమని, విమర్శల్ని పట్టించుకోకుండా పరుగులు సాధించి ఇంటికెళ్లాలనుకుంటానని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. కాగా.. 2008లో జరిగిన ట్రై సిరీస్‌లో భాగంగా సెహ్వాద్ మొదటి నాలుగు మ్యాచుల్లో 6, 33, 11, 14 స్కోర్స్ మాత్రమే చేశాడు. దీంతో, సెహ్వాగ్‌ని ధోనీ తుది జట్టు నుంచి తప్పించాడు.