Virat Kohli: కోహ్లీ 100 సెంచరీల వేట.. గిల్, అయ్యర్‌కు తప్పిన చిక్కు.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Virat Kohli 100 International Centuries

Virat Kohli 100 International Centuries

Virat Kohli 100 International Centuries: న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ప్రదర్శనపై చర్చ కొనసాగుతోంది. తొలి వన్డేలో కోహ్లీ 51 బంతుల్లో 74 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరికొంతసేపు క్రీజులో ఉండి ఉంటే.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సందిగ్ధంలో పడేవారని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీల మైలురాయికి కోహ్లీ చేరువలో ఉండటంతో.. సన్నీ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రాధాన్యత సంతరించుకుంది.

వ్యక్తిగత మైలురాయి కూడా ఉండాలి:


మిడ్-డేలో రాసిన తన తాజా కాలమ్‌లో విరాట్ కోహ్లీ 100 సెంచరీల మైలురాయి, కింగ్ ప్రదర్శనపై సునీల్ గవాస్కర్ స్పందించారు. ‘జట్టు విజయం ఎప్పుడూ ప్రాధాన్యంగా ఉండాలి. అదే సమయంలో ఒక ఆటగాడు వ్యక్తిగత మైలురాయిని చేరుకోవడం కూడా జట్టుకు, అభిమానులకు గర్వకారణం. విరాట్ కోహ్లీ 100 అంతర్జాతీయ సెంచరీలు సాధించాలని ప్రతి భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. రికార్డుల విషయంలో భారత అభిమానులకు ఎప్పటి నుంచో ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. కోహ్లీ 100 సెంచరీల ఘనతను అందుకునే అవకాశం వచ్చినప్పుడు.. మరో ఆటగాడు తన పరుగులను త్యాగం చేసి అతడికి అవకాశం కల్పించాలి. అరుదైన ఘనత కోహ్లీకి మాత్రమే కాకుండా.. యావత్ భారత అభిమానులకు కూడా ఆనందాన్ని ఇస్తుంది’ అని గవాస్కర్ పేర్కొన్నారు.

ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యేది:
తొలి వన్డేలో వర్షం అంతరాయం కలిగించిన నేపథ్యంలో భారత్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ కోహ్లీ 74 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ సమయానికి భారత్ 124/3తో నిలిచింది. లక్ష్యం పెద్దగా లేకపోవడంతో మ్యాచ్ ముగింపు దశలో కోహ్లీ సెంచరీ సాధించే అవకాశం లేకుండానే వెనుదిరిగాడు. ఒకవేళ కోహ్లీ 90లలో ఉండి, భారత్ విజయానికి అవసరమైన పరుగులు మిగిలి ఉంటే.. శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌కు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యేదని సునీల్ గవాస్కర్ విశ్లేషించారు. జట్టు విజయానికి అవసరమైన పరుగులు చేయాలా? లేదా కోహ్లీ సెంచరీకి అవకాశం కల్పించేలా నెమ్మదిగా ఆడాలా? అనే సందిగ్ధం ఏర్పడేదని పేర్కొన్నారు. కోహ్లీ 70లలోనే ఔటవడంతో గిల్, అయ్యర్ అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సిన అవసరం రాలేదని సన్నీ చెప్పారు.

అభిమానుల్లో ఆసక్తి:
క్రికెట్ జట్టు ఆట అయినప్పటికీ, జట్టులోని స్టార్ ఆటగాడు వ్యక్తిగత మైలురాయిని చేరుకోవడం కూడా జట్టుకు మంచిదేనని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అయితే అది జట్టు విజయావకాశాలను దెబ్బతీయకూడదని స్పష్టం చేశారు. విరాట్ కోహ్లీ 100 అంతర్జాతీయ సెంచరీలు సాధిస్తే.. అది భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా నిలుస్తుందని గవాస్కర్ పేర్కొన్నారు. ప్రస్తుతం కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 86 సెంచరీలు సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న అతడికి 100 సెంచరీల మైలురాయిని అందుకోవడానికి ఇంకా 14 శతకాలు అవసరం. 2027 వన్డే ప్రపంచ కప్ తర్వాత కింగ్ ఆడుతాడో లేదో తెలియదు. ఈ నేపథ్యంలో ఈ ఘనతను ఎప్పుడు అందుకుంటాడన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు సచిన్ టెండూల్కర్ మాత్రమే.