టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి పెను విధ్వంసం సృష్టించాడు. అండర్-19 ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో భారత్, యూఏఈ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వైభవ్ మరో తుఫాన్ సెంచరీ బాదాడు. 95 బంతుల్లో 175 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. 14 ఏళ్ల వైభవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. 56 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.
వైభవ్ సూర్యవంశీ రెండవ ఓవర్‌లో ఫోర్ ద్వారా తన పరుగుల ఖాతా తెరిచాడు. మూడవ ఓవర్‌లో ఆయుష్ మాత్రే వికెట్ పడినా.. వైభవ్ మాత్రం తన దూకుడు బ్యాటింగ్‌ను కొనసాగించాడు. యూఏఈ బౌలర్లపై విరుచుకుపడుతూ 30 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. అర్ధ సెంచరీ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. కేవలం 26 బంతుల్లో మరో ఫిఫ్టీని సాధించాడు. 56 బంతుల్లో సెంచరీ చేశాడు. సెంచరీ అనంతరం కూడా వైభవ్ దూకుడు ఆగలేదు. సిక్సులతో విరుచుకుపడుతూ చూస్తుండగానే 150 రన్స్ చేశాడు. డబుల్ సెంచరీ సాదిస్తాడనుకునే లోపే 175 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. యూఏఈ ఫీల్డర్లు చేసిన తప్పులను సద్వినియోగం చేసుకుని వైభవ్ సెంచరీ సాధించాడు. 28, 85 పరుగుల వద్ద ఉన్నపుడు అతడికి లైఫ్స్ లభించాయి.
Also Read: HBD Rajinikanth: ‘రజనీ’ రొమాన్స్ సూపర్ హిట్.. తన కంటే 37 ఏళ్ల చిన్న హీరోయిన్‌తో..!
వైభవ్ సూర్యవంశీ వరుస సెంచరీలు బాదుతున్నాడు. తాజాగా బీహార్ తరపున ఆడుతూ ఈడెన్ గార్డెన్స్‌లో మహారాష్ట్రపై 61 బంతుల్లో 108 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. టోర్నమెంట్ చరిత్రలో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఇక వైభవ్ విధ్వంసంతో అండర్-19 ఆసియా కప్ 2025లో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళుతోంది. 38 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్స్ కోల్పోయి 294 రన్స్ చేసింది.
