Vaibhav Sooryavanshi: వైస్‌ కెప్టెన్‌ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్‌.. వీడియో వైరల్!

Vaibhav Sooryavanshi Drs Call

Vaibhav Sooryavanshi Drs Call

Vaibhav Sooryavanshi DRS Call Goes Viral: దులీప్‌ ట్రోఫీ 2026లో ఈస్ట్‌ జోన్‌ తరఫున ఆడుతున్న యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ బ్యాట్‌తోనే కాకుండా నాయకత్వ లక్షణాలతోనూ ఆకట్టుకుంటున్నాడు. టోర్నీ ప్రారంభం నుంచి జట్టుకు కీలక ఆటగాడిగా మారిన బుడ్డోడు.. ఇప్పుడు వైస్‌ కెప్టెన్‌గా తన బాధ్యతను కూడా సమర్థంగా నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం సౌత్‌ జోన్‌తో జరుగుతున్న ఫైనల్లో వైభవ్‌ తీసుకున్న ఓ నిర్ణయం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఫైనల్లో మూడో రోజు సౌత్‌ జోన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో కెప్టెన్‌ ఇషాన్ కిషన్‌కే సలహా ఇచ్చాడు.

ఈస్ట్‌ జోన్‌ బౌలర్‌ ముఖేశ్‌ కుమార్‌ వేసిన బంతిని సౌత్‌ జోన్‌ బ్యాటర్ రికీ భుయ్‌ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి బ్యాట్‌ను తాకినట్లు ఈస్ట్‌ జోన్‌ ఆటగాళ్లు భావించి అప్పీల్‌ చేశారు. అయితే ఫీల్డ్‌ అంపైర్‌ మాత్రం బ్యాట్‌కు బంతి తగలలేదని భావించి అప్పీల్‌ను తిరస్కరించాడు. అదే సమయంలో వికెట్‌ కీపర్‌గా ఉన్న కుమార్‌ కుషాగ్ర క్యాచ్‌ను అందుకున్నాడు. ఫీల్డ్‌లో పరిస్థితిని గమనించిన వైభవ్‌ సూర్యవంశీ.. కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌కు డీఆర్‌ఎస్‌ తీసుకోవాలని సూచించాడు. ‘టేక్‌ ఇట్‌.. టేక్‌ ఇట్‌’ అంటూ వైభవ్‌ చెప్పిన మాటలు స్టంప్‌ మైక్‌లో స్పష్టంగా వినిపించాయి.

వైభవ్‌ సూర్యవంశీ సలహాతో ఇషాన్‌ కిషన్‌ వెంటనే డీఆర్‌ఎస్‌ కోరాడు. రివ్యూలో అల్ట్రాఎడ్జ్‌ పరిశీలించగా.. బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పష్టమైంది. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. రికీ భుయ్‌ పెవిలియన్ చేరాడు. ఇక్కడ కుమార్‌ కుషాగ్ర అద్భుతమైన క్యాచ్‌ పట్టినప్పటికీ.. రివ్యూ తీసుకోవడంలో వైభవ్‌ పాత్ర కీలకంగా మారింది. కామెంటేటర్‌ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వైభవ్‌ను ప్రశంసించాడు. డీఆర్‌ఎస్‌ తీసుకోవాల్సిందిగా ఇషాన్‌ను వైభవ్‌ ఒప్పించాడని పేర్కొన్నాడు.

దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో ఇషాన్‌ కిషన్‌ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో వైభవ్‌ సూర్యవంశీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆ మ్యాచ్‌లో నాయకుడిగా వ్యవహరించిన వైభవ్‌.. ఇప్పుడు ఫైనల్లో వైస్‌ కెప్టెన్‌గా తనదైన ముద్ర వేస్తున్నాడు. చిన్న వయసులోనే సీనియర్‌ ఆటగాళ్లతో కలిసి ఆడుతూ కీలక సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవడం వైభవ్‌ పరిణతికి నిదర్శనంగా నిలుస్తోంది. తాజాగా డీఆర్‌ఎస్‌ విషయంలో బుడ్డోడు చూపించిన అప్రమత్తత.. ఈస్ట్‌ జోన్‌కు కీలక వికెట్‌ను అందించడమే కాకుండా, తనను వైస్‌ కెప్టెన్‌గా ఎందుకు ఎంపిక చేశారో మరోసారి చాటిచెప్పాడు.