Usman Khawaja On Michael Beer Incident: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా రాసిన ఆత్మకథ ‘సబ్ర్’ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఈ పుస్తకంలో ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు, వెల్లడించిన ఆసక్తికర సంఘటనలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా 2018లో ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన బాల్ ట్యాంపరింగ్ వివాదం గురించి ఖవాజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇదే పుస్తకంలో తన మాజీ సహచరుడు మైఖేల్ బీర్‌తో ఎదురైన ఓ ఇబ్బందికరమైన అనుభవాన్ని కూడా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తన ఆత్మకథలో ఉస్మాన్ ఖవాజా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒకసారి మైఖేల్ బీర్ తన గదికి భోజనం చేసేందుకు వచ్చాడు. గదిలో స్థలం లేకపోవడంతో బెడ్ అంచున కూర్చుని భోజనం చేయడం ప్రారంభించాడు. ఇంతలో భోజనం మధ్యలో బీర్‌కు ఒక్కసారిగా తుమ్ము వచ్చింది. ఆ సమయంలో అతడు గట్టిగా అరుస్తూ.. ‘ఓహ్ షిట్’ అని అన్నాడు. దీంతో ఖవాజా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. ఏమైందో తెలుసుకునేందుకు వెంటనే అతడి వద్దకు వెళ్లాడు. బీర్ తనకు క్షమాపణలు చెప్పి బెడ్‌పై నుంచి లేచాడు. అయితే అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఖవాజా షాక్‌కు గురయ్యాడు. బెడ్‌షీట్‌పై గోధుమ రంగు మరక కనిపించగా.. బీర్ ప్యాంట్‌పై కూడా అదే మరక ఉంది. తుమ్మిన సమయంలో బీర్‌కు అపానవాయువుతో పాటు మల విసర్జన కూడా జరిగిందని ఖవాజా తన పుస్తకంలో వివరించాడు. ఈ అనూహ్య ఘటనను ఖవాజా తన ఆత్మకథలో హాస్యభరితంగా ప్రస్తావించారు.
మరోవైపు 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా వెలుగులోకి వచ్చిన శాండ్‌పేపర్ వివాదంపై కూడా ఖవాజా తన పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడించారు. అప్పట్లో ఆస్ట్రేలియా జట్టు బంతి స్వభావాన్ని మార్చేందుకు శాండ్‌పేపర్ ఉపయోగించిన విషయం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వివాదం కారణంగా అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌పై చర్యలు తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారం గురించి జట్టులోని అందరికీ ముందే తెలుసని ఖవాజా తన ఆత్మకథలో పేర్కొన్నాడు. అప్పటి జట్టులో ఉన్న ప్యాట్ కమిన్స్‌కు కూడా ఈ విషయం తెలుసని ఆరోపించారు. అంతేకాకుండా కేప్‌టౌన్‌లో జరిగిన మూడో టెస్టుతో పాటు పోర్ట్ ఎలిజబెత్‌లో జరిగిన రెండో టెస్టులోనూ ఈ వ్యూహాన్ని అమలుపరిచినట్లు ఖవాజా తన పుస్తకంలో ప్రస్తావించారు.
ఖవాజా చేసిన ఆరోపణలపై ఆస్ట్రేలియా ప్రస్తుత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. ఖవాజా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశాడు. జట్టులోని అందరికీ శాండ్‌పేపర్ వ్యవహారం ముందే తెలుసన్న ఆరోపణలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశాడు. ‘బంతిని రఫ్ చేసేందుకు శాండ్‌పేపర్‌ను మైదానంలోకి తీసుకెళ్తున్న విషయం మాకు అందరికీ తెలుసని ఖవాజా చెబుతున్నట్లయితే.. అది 100 శాతం తప్పు. పూర్తిగా అర్థరహితమైన ఆరోపణ’ అని కమిన్స్ స్పష్టం చేశాడు. ఖవాజా ఆత్మకథ విడుదలైన తర్వాత అందులోని వ్యక్తిగత సంఘటనలు, శాండ్‌పేపర్ వివాదానికి సంబంధించిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. కమిన్స్ చేసిన తాజా వ్యాఖ్యలతో 2018 బాల్ ట్యాంపరింగ్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది.

