న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్‌లో అంపైర్లు చేసిన తప్పిదం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ల నిర్లక్ష్యం కారణంగా ఒక ఓవర్‌లో బౌలర్ ఎలాంటి తప్పిదం చేయకుండానే ఏడు బంతులు వేసింది. వైడ్, నోబాల్స్ వేయకుండా ఒక బంతి ఎక్కువగా సంధించింది.
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 27వ ఓవర్ వేసిన పాకిస్థాన్ బౌలర్ ఒమైమా సోహైల్ ఆరు బంతులు బదులు ఏడు బంతులు వేసింది. ఈ ఓవర్ చివరి బంతికి సఫారీ బ్యాటర్ సునే లూస్ ఎల్బీగా అవుటైంది. అయితే అంపైర్ నిర్ణయంపై సమీక్షకు వెళ్లిన సునే లూస్ ఫలితాన్ని రాబట్టింది. తన నిర్ణయం తప్పుగా తేలడంతో కొంత గందరగోళానికి గురైన ఫీల్డ్ అంపైర్.. బౌలర్ వేసిన బంతుల సంఖ్యను మరిచిపోయాడు. దాంతో మరో బంతిని వేయించాడు. అదనపు బంతికి దక్షిణాఫ్రికా టీమ్ సింగిల్ తీసింది. ప్రపంచకప్ లాంటి టోర్నీలో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో అంపైర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
