Tim Southee Creates World Record In T20I: న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్‌కప్ 2022 టోర్నీలో సూపర్-12లో భాగంగా.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్‌తో అతడు ఆ ఘనతని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకూ 101 మ్యాచ్‌లు ఆడిన టిమ్ సౌతీ.. మొత్తంగా 123 వికెట్లు తీశాడు. అంతకుముందు.. ఈ రికార్డ్ బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ ఆల్ హాసన్ పేరిట ఉండేది. ఇప్పటిదాకా 104 మ్యాచ్‌లు ఆడిన షకీబ్, మొత్తంగా 122 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఆ రికార్డ్‌ని టిమ్ సౌథీ బద్దలు కొట్టేశాడు. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్‌లు కలిపి చూస్తే.. ఇప్పటి వరకు 337 మ్యాచ్‌లు ఆడిన సౌథీ, 669 వికెట్లు సాధించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగిన న్యూజీల్యాండ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫిన్ ఆలెన్(42), డివాన్ కాన్వే(92) ఇద్దరూ విధ్వంకరమైన ఇన్నింగ్స్ ఆడటంతో, కివీస్ జట్టు అంత భారీ స్కోరు చేయగలిగింది. ఇక 201 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. 111 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బౌలర్ల ధాటికి ఏ ఒక్కరూ నిలకడగా రాణించలేకపోయారు. వచ్చిన వారు వచ్చినట్లుగానే పెవిలియన్ చేరడంతో.. 111 పరుగులకే ఆలౌటయ్యారు. 28 పరుగులతో మ్యాక్స్‌వెల్ ఒక్కడే హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడంటే.. ఆస్ట్రేలియా బ్యాటర్లు ఎంత ఘోరంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు.
