Tilak Varma Joins Medak Falcons in TG20 League 2026: తెలంగాణ యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 క్రికెట్ లీగ్‌కు రంగం సిద్ధమైంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఆదివారం (జూన్ 7) హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత చారు శర్మ వేలాన్ని నిర్వహిస్తుండగా.. లీగ్‌లో భాగమైన ఎనిమిది ఫ్రాంఛైజీలు తమ జట్లను బలోపేతం చేసుకునేందుకు పోటీపడుతున్నాయి.
తిలక్ వర్మ కోసం హోరాహోరీ పోటీ
వేలంలో భారత యువ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మకు భారీ ధర పలికింది. రూ.5 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన తిలక్ కోసం మెదక్ ఫాల్కన్స్, పాలమూరు స్ట్రైకర్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మధ్యలో నల్గొండ జట్టు కూడా బిడ్డింగ్‌లోకి దిగడంతో ధర అమాంతం పెరిగింది. చివరికి మెదక్ రూ.33 లక్షల భారీ మొత్తానికి తిలక్ వర్మను సొంతం చేసుకుంది. ఈ వేలంలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధర ఇదే. మెదక్ జట్టు సగంకు పైగా ధరను తిలక్ కోసమే వెచ్చించింది.
తన్మయ్ అగర్వాల్‌కు మంచి ధర:
ఐకాన్ ప్లేయర్‌గా వేలంలోకి వచ్చిన తన్మయ్ అగర్వాల్ కూడా మంచి ధర పలికాడు. రూ.5 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని కరీంనగర్ డైమండ్స్ జట్టు రూ.8 లక్షలకు కొనుగోలు చేసింది. తెలంగాణ క్రికెట్‌లో అనుభవజ్ఞుడైన బ్యాటర్‌గా తన్మయ్‌పై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపించాయి. రోహిత్ రాయుడుకు రూ.6.5 లక్షలకు పాలమూరు స్ట్రైకర్స్, సి.వి. మిలింద్‌ను రూ.17 లక్షలకు అన్విత ఖమ్మం ఏసెస్, తనయ్ త్యాగరాజన్‌ను రూ.11 లక్షలకు రంగారెడ్డి జట్టు, రవితేజను రూ.12 లక్షలకు తీసుకున్న మెదక్ టీమ్ కైవసం చేసుకుంది.
ఫ్రాంఛైజీలకు రూ.60 లక్షల పర్స్:
టీజీ20 లీగ్‌లో పాల్గొంటున్న ప్రతి ఫ్రాంఛైజీకి ఆటగాళ్ల కొనుగోలు కోసం రూ.60 లక్షల పర్స్ పరిమితిని హెచ్‌సీఏ నిర్ణయించింది. అయితే కనీసం రూ.54 లక్షలు ఖర్చు చేయడం తప్పనిసరి. దీంతో జట్లు యువ ప్రతిభావంతులైన ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులైన క్రికెటర్లను కూడా ఎంపిక చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి.
జూన్ 20 నుంచి టోర్నీ ప్రారంభం:
టీజీ20 లీగ్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జూన్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం టోర్నీ మూడు వారాల పాటు కొనసాగి జూలై 11న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. తెలంగాణ క్రికెట్ అభిమానులకు వినోదాన్ని అందించడంతో పాటు యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను చాటుకునే వేదికగా ఈ లీగ్ నిలవనుంది. తెలంగాణ క్రికెట్‌కు కొత్త ఊపిరి పోసే ఈ టీజీ20 లీగ్ ద్వారా మరెంతమంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తారో చూడాల్సి ఉంది.
స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం:
టీజీ20 లీగ్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అలాగే జియో హాట్‌స్టార్ యాప్ ద్వారా కూడా అభిమానులు మ్యాచ్‌లను వీక్షించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర స్థాయి లీగ్‌కు జాతీయ స్థాయిలో ప్రసార భాగస్వామ్యం లభించడం టోర్నీకి మరింత ప్రాధాన్యతను తీసుకువచ్చింది.

