Site icon NTV Telugu

ICC Player Of the Month: ఆగస్టు నెల ఐసీసీ అవార్డు రేసులో టీమిండియా క్రికెటర్లకు దక్కని చోటు

Icc Player Of The Month

Icc Player Of The Month

ICC Player Of the Month: ఆగస్టు నెలకు సంబంధించి మూడు ఫార్మాట్లలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం ముగ్గురు క్రికెటర్లు నామినేట్ అయ్యారు. ఈ మేరకు ఐసీసీ ఈ లిస్టును విడుదల చేసింది. ఈ జాబితాలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్, జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ సికిందర్ రజా ఉన్నారు. వీరిలో సికిందర్ రజా ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఆగస్టు నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలు చేసిన రజా.. తన జట్టు 2-1 తేడాతో సిరీస్ గెలుపొందడానికి కారణమయ్యాడు. అటు టీమిండియాపై మూడో వన్డేలోనూ సెంచరీ చేశాడు. అంతే కాకుండా బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌‌ను సైతం జింబాబ్వే కైవసం చేసుకోవడంలో రజా కీలక పాత్ర పోషించాడు.

మరోవైపు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో రెండో టెస్టులో ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ అంచనాలకు మించి రాణించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడమే కాకుండా సెంచరీ చేసి ఇంగ్లండ్ విజయంలో స్టోక్స్ కీలకపాత్ర పోషించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా కైవసం చేసుకున్నాడు. అటు నెదర్లాండ్స్ పర్యటనలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మిచెల్ శాంట్నర్ కూడా మంచి ప్రదర్శన చేశాడు. మూడో వన్డేలో 42 బంతుల్లో 77పరుగులు సాధించి జట్టు విజయానికి కారణమయ్యాడు. దీంతో ఈ ముగ్గురు ఆటగాళ్లను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో నిలబెట్టింది. మరి ఈ ముగ్గురిలో ఎవరు ఈ అవార్డును కైవసం చేసుకుంటారో వేచి చూడాల్సిందే. అయితే ఈ రేసులో టీమిండియా క్రికెటర్లు లేకపోవడంతో భారత అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Exit mobile version