NTV Telugu Site icon

Commonwealth Games: హైజంప్‌లో భారత్‌కు పతకం.. తొలి అథ్లెట్‌గా తేజస్విన్ రికార్డు

Tejaswin Shankar

Tejaswin Shankar

Tejaswin Shankar Won India First Medal In High Jump At CWG 2022: కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్‌కు మరో పతకం దక్కింది. హైజంప్‌లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్య పతకం సాధించాడు. దీంతో.. కామన్వెల్త్‌ గేమ్స్‌ హైజంప్‌ విభాగంలో దేశానికి పతకం అందించిన తొలి అథ్లెట్‌గా అతను రికార్డ్ నెలకొల్పాడు. బుధవారం అర్థరాత్రి జరిగిన హైజంప్‌ ఫైనల్స్‌లో శంకర్‌ 2.22 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచాడు. అయితే.. జూన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌లో శంకర్‌ 2.27 మీటర్ల దూరం జంప్‌ చేశాడు. ఆ రికార్డ్‌తో పోలిస్తే, కామన్‌వెల్త్‌తో 0.05 మీటర్ల తేడా వచ్చింది. ఇది కొంచెం నిరాశజనకమే.

కానీ.. హైజంప్‌లో దేశానికి తొలి పతకం తీసుకొచ్చిన అథ్లెట్‌గా అతను చరిత్రపుటలకెక్కాడు. ఈ సందర్భంగా శంకర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ‘‘తేజస్విన్ శంకర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో హైజంప్‌ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు. కాంస్య పతకం సాధించినందుకు శంకర్‌కు అభినందనలు. నీ ప్రదర్శన పట్ల దేశం గర్విస్తుంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సైతం.. ‘‘కామన్వెల్త్‌ క్రీడల్లో హైజంప్‌ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు’’ అంటూ శంకర్‌ను ప్రశంసించారు.

కాగా.. హైజంప్ విభాగంలో న్యూజీల్యాండ్‌కు చెందిన హీష్ కెర్ 2.25 మీటర్లు జంప్ చేసి, స్వర్ణం సాధించాడు. ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్‌ స్టార్క్‌ రెండో స్థానంలో నిలిచి, సిల్వర్‌ సొంతం చేసుకున్నాడు. తేజస్విన్ శంకర్ సాధించిన పతకంతో.. భారత్‌ ఖాతాలో ఇప్పటివరకు 18 పతకాలు వచ్చాయి. అందులో 5 స్వర్ణాలు, ఆరు రజతాలు, ఏడు కాంస్య పతకాలున్నాయి.