Team India Mission 300: టీ20 క్రికెట్‌లో భారత జట్టు అద్భుతాలు చేస్తున్న విషయం తెలిసిందే. ద్వైపాక్షిక సిరీస్‌లతో పాటు టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్‌గా కూడా నిలిచింది. ఇటీవల ఒకటి, రెండు సిరీస్‌లలో కాస్త నిరాశపర్చినా.. ఇప్పుడు మరలా పుంజుకుంది. ఇందుకు కారణం దూకుడు బ్యాటింగే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో టీమిండియా మరో సంచలన మార్క్‌పై కన్నేసింది. భారీ స్కోర్లు సాధిస్తూ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తున్న భారత్.. త్వరలోనే 300 పరుగుల మార్క్‌ను అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జట్టులో ఉన్న ప్రతిభను చూస్తే ఈ ఘనత సాధించడం సాధ్యమేనని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు.
ఆఫ్ఘనిస్థాన్‌తో గురువారం జరిగిన మూడో టీ20లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌పై మాట్లాడిన గౌతమ్ గంభీర్.. అభిషేక్ వ్యక్తిగత సెంచరీ కంటే అతడి ఇన్నింగ్స్ జట్టుపై చూపించిన ప్రభావమే ముఖ్యమని చెప్పారు. అదే సమయంలో పవర్‌ప్లేలో భారత్ తొలిసారి 100 పరుగులు చేయడం తన కోచింగ్ కాలంలోనే ప్రత్యేకమైన ఘట్టమని పేర్కొన్నారు. ‘అతిపెద్ద సానుకూల అంశం ఏంటంటే.. పవర్‌ప్లేలోనే 100 పరుగులు చేయడం. నా కోచింగ్‌లో భారత్ ఇలా ఎప్పుడూ ఆడలేదు. మనం దూకుడుగా ఆడటం మొదలుపెడితే అదే దూకుడును కొనసాగించాలన్న సందేశాన్ని ఈ ఇన్నింగ్స్ ఇచ్చింది’ అని గంభీర్ తెలిపారు.
టీమిండియా తర్వాతి లక్ష్యం 300 పరుగులేనని గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. ‘టీమిండియా ఇంకా 300 పరుగుల మార్క్‌ను చేరుకోలేదు. అదే మా తదుపరి లక్ష్యం. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న ప్రతిభను చూస్తే మనం మరిన్ని అద్భుతాలు చేయాలి’ అని గంభీర్ అన్నారు. టీ20ల్లో భారత్ అత్యధిక స్కోరు 297 పరుగులు. 2024లో బంగ్లాదేశ్‌పై భారత్ ఈ స్కోరు చేసింది. అదే ఏడాది దక్షిణాఫ్రికాపై 283/1 పరుగులు కూడా చేసింది. ఆఫ్ఘనిస్థాన్‌తో తాజా మ్యాచ్‌లోనూ భారత్‌కు భారీ స్కోరు చేసే అవకాశం వచ్చింది. అయితే చివరి ఐదు ఓవర్లలో బ్యాటర్లు ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోవంతో భారత్ 221/7 వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది.
అభిషేక్ శర్మ సెంచరీపై గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… ‘అభిషేక్ అద్భుతంగా ఆడాడు. అతను ఎన్ని పరుగులు చేశాడనే దాని గురించి మాత్రమే మాట్లాడటం కంటే.. అతడి ఇన్నింగ్స్ జట్టులో ఎంత ప్రభావాన్ని తీసుకొచ్చిందనేదే ముఖ్యం. బ్యాట్‌తో ఎంత ప్రభావం చూపగలం, బంతితో ఎంత ప్రభావం చూపగలం అనేదే మా డ్రెస్సింగ్ రూమ్‌లో అసలు చర్చ. గత రెండేళ్లుగా మా సిద్ధాంతం ఒకటే. టీ20 క్రికెట్ అంటే కేవలం పరుగులు లేదా వికెట్లు కాదు. మీరు ఆటపై ఎంత ప్రభావం చూపించగలరనేదే ముఖ్యం’ అని గంభీర్ స్పష్టం చేశారు. 300 పరుగుల మార్క్‌ను అందుకోవాలనే లక్ష్యం ఇప్పుడు శ్రేయాస్ సేన ముందుంది.

