T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026 ముందు అంతర్జాతీయ క్రికెట్‌లో మరోసారి రాజకీయాలు తెరపైకి వచ్చాయి. బంగ్లాదేశ్ జట్టును టోర్నమెంట్ నుంచి తొలగించిన ఐసీసీ నిర్ణయాన్ని నిరసిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కొత్త డ్రామాకు తెరలేపింది. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించే అంశాన్ని పాకిస్తాన్ పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్ తొలగింపు.. స్కాట్లాండ్‌కు అవకాశం
2026 ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వెళ్లేందుకు నిరాకరించింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేయగా, ఐసీసీ ఆ అభ్యర్థనను తిరస్కరించింది. 24 గంటల అల్టిమేటం జారీ చేసినప్పటికీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి స్పందన రాకపోవడంతో, ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుని బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుంచి తొలగించింది. వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టుకు అవకాశం కల్పించింది.
ఐసీసీ నిర్ణయంపై పీసీబీ అసంతృప్తి
బంగ్లాదేశ్ తొలగింపుపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలోనే టోర్నమెంట్‌ను బహిష్కరిస్తామని పీసీబీ బెదిరించిన విషయం తెలిసిందే. ఐసీసీ హెచ్చరికల నేపథ్యంలో వెనక్కి తగ్గిన పాకిస్తాన్, నిశ్శబ్దంగా టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించింది.
భారత్‌తో మ్యాచ్‌కు బహిష్కరణ?
అయితే పాకిస్తాన్ డ్రామా ఇక్కడితో ముగియలేదు. జియో సూపర్ కథనం ప్రకారం, ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్‌తో జరిగే గ్రూప్ మ్యాచ్‌ను బహిష్కరించే అంశాన్ని పాకిస్తాన్ తీవ్రంగా పరిశీలిస్తోంది. బంగ్లాదేశ్‌ను తప్పించి స్కాట్లాండ్‌కు అవకాశం ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్.. భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే రెండు పాయింట్లు కోల్పోవాల్సి ఉంటుంది. అయితే, ఐసీసీ ఆర్థికంగా భారీ నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
మొహ్సిన్ నఖ్వీ వ్యాఖ్యలు
పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ జట్టుతో సమావేశం నిర్వహించి వ్యూహం, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించనున్నారు. సమాఖ్య ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ప్రస్తుతం దేశంలో లేరు. ఆయన తిరిగివచ్చిన తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తాం అని నఖ్వీ చెప్పారు. బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగిందని, ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆయన ఆరోపించారు. ఐసీసీ నిర్ణయంలో బీసీసీఐ ప్రభావం ఉందా అనే అంశాన్ని కూడా ప్రశ్నించారు.
షెడ్యూల్ ప్రకారం, పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్‌లో
ఫిబ్రవరి 7: నెదర్లాండ్స్
ఫిబ్రవరి 10: అమెరికా
ఫిబ్రవరి 15: భారత్‌త
ఫిబ్రవరి 18: నమీబియాతో తలపడనున్నాయి..
గ్రూప్ మ్యాచ్‌లన్నీ కొలంబోలో జరగనున్నాయి. సూపర్-8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 1 వరకు, సెమీ ఫైనల్స్ మార్చి 3, 5 తేదీల్లో జరగనుండగా, ఫైనల్ మార్చి 8న అహ్మదాబాద్ లేదా కొలంబోలో నిర్వహించనున్నారు. ఇక, టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ జట్టుకు సల్మాన్ అలీ అఘా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. పేలవమైన ఫామ్‌లో ఉన్న బాబర్ ఆజం కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. షాదాబ్ ఖాన్, ఖవాజా నఫాయ్, ఉస్మాన్ తారిక్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అయితే హారిస్ రౌఫ్, మహ్మద్ రిజ్వాన్ వంటి అనుభవజ్ఞులు ఈసారి జట్టుకు దూరమయ్యారు.
