Site icon NTV Telugu

T20 World Cup 2026: చిన్న టీమ్‌ల పోరాటం, టాప్ జట్లకు జులక్.. అభిమానులకు నాన్‌స్టాప్ థ్రిల్‌!

T20 World Cup 2026 Thrills

T20 World Cup 2026 Thrills

2026 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆరంభం నుంచే అభిమానులకు హార్ట్‌ ఎటాక్‌ను తెప్పిస్తున్నాయి. పెద్ద జట్లు, చిన్న జట్లు అనే తేడా లేకుండా.. ప్రతి మ్యాచ్ చివరి ఓవర్ల వరకు వెళ్లుతూ ఆహా అనిపిస్తున్నాయి. నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నేపాల్, అమెరికా లాంటి టీమ్స్ అద్భుత ప్రదర్శన చేసి.. టాప్ టీమ్‌లను ఓడించినంత పని చేశాయి. ఈ మెగా టోర్నీ క్రికెట్ ప్రపంచంలో మారుతున్న శక్తి సమీకరణాలకు అద్దం పడుతోంది.

నెదర్లాండ్స్ పాకిస్థాన్‌పై గెలుపుకు చాలా దగ్గరగా వచ్చింది. చివరి క్షణాల్లో మ్యాచ్ చేజారినా.. డచ్ జట్టు పోరాటం అందరినీ ఆశ్చర్యపరిచింది. పాకిస్థాన్ లాంటి బలమైన జట్టును ఒత్తిడిలోకి నెట్టడం చిన్న విషయం కాదు. అలాగే స్కాట్లాండ్ కూడా వెస్టిండీస్‌పై అద్భుతంగా పోరాడింది. పవర్ హిట్టర్లతో పేరున్న కరీబియన్ జట్టుకు స్కాట్లాండ్ గట్టి పోటీ ఇచ్చి మ్యాచ్‌ను చివరి వరకు ఉత్కంఠ భరితంగా మార్చింది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏ జట్టు కూడా బాగా ఆడింది. ప్రపంచ క్రికెట్‌లో కొత్తగా ఎదుగుతున్న యూఎస్ఏ.. టీమిండియాను వణికించింది. ఈ మ్యాచ్ అమెరికా క్రికెట్ భవిష్యత్తుపై ఆశలు పెంచింది.

Also Read: T20 World Cup 2026: మ్యాచ్‌ ఆడకపోవడం ఏంటి?.. పాకిస్థాన్‌పై గంగూలీ ఫైర్!

అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా హై వోల్టేజ్‌గా సాగింది. టాప్ ప్లేయర్స్ ఉన్న కివీస్‌ను అఫ్గాన్ చివరి వరకు పోటీలో నిలిచింది. మ్యాచ్‌ను క్లైమాక్స్ వరకు తీసుకెళ్లింది. ఇక నేపాల్ ప్రదర్శన అయితే టోర్నీ హైలైట్‌లలో ఒకటిగా నిలిచింది. ఇంగ్లాండ్‌పై గెలుపు అంచుల వరకూ వెళ్లి.. చివరి క్షణాల్లో ఓటమి పాలైంది. నేపాల్ ఆటతీరు ప్రపంచాన్ని మెప్పించింది. క్రికెట్‌లో కొత్త శక్తిగా నేపాల్ ఎదుగుతోందని మరోసారి నిరూపించింది. ఇది ఇంకా ఆరంభం మాత్రమే. చిన్న క్రికెట్ జట్లు చూపిస్తున్న ఆత్మవిశ్వాసం, పోరాటం చూస్తే.. ఈ ప్రపంచకప్ చివరి వరకు ఇలాగే థ్రిల్ ప్యాక్‌డ్‌గా సాగనుందని స్పష్టమవుతోంది.

Exit mobile version