Site icon NTV Telugu

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీ కోసం.. న్యూజిలాండ్‌ సీక్రెట్ ప్లాన్!

New Zealand Secret Plan

New Zealand Secret Plan

న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ ‘గ్లెన్ ఫిలిప్స్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్, బౌలింగ్, వికెట్‌కీపింగ్ మాత్రమే కాదు.. బౌండరీ వద్ద అసాధారణమైన ఫీల్డింగ్‌తో మ్యాచ్‌లను తిప్పేయగలడు. ఇప్పుడు ఈ కివీస్ స్టార్ మరో కొత్త ఆయుధాన్ని పరిచయం చేశాడు. అదే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్. ఇటీవల సూపర్ స్మాష్ టోర్నీలో జరిగిన ఓ మ్యాచ్‌లో ఫిలిప్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. సాధారణంగా కుడిచేత్తో బ్యాటింగ్ చేసే ఫిలిప్స్.. ఓ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్‌ను ఎదుర్కొందుకు స్టాన్స్ మార్చి బ్యాటింగ్ చేశాడు. బంతి వెళ్లి మైదానం బయట పడింది.

సూపర్‌ స్మాష్‌ టోర్నీలో ఒటాగోకు గ్లెన్ ఫిలిప్స్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సెంట్రల్‌ డిస్ట్రిక్ట్స్‌పై ఫిలిప్స్‌ కొన్ని ఓవర్లు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్‌ చేశాడు. లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎడమ చేత్తో బ్యాటింగ్‌ చేశాడు. ఎక్స్‌ట్రా కవర్ దిశగా కొట్టిన షాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది కేవలం ప్రయోగమా? లేదా టీ20 వరల్డ్‌కప్ 2026ను దృష్టిలో పెట్టుకుని ఫిలిప్స్ రూపొందించిన ప్రత్యేక వ్యూహమా? అనే చర్చ నెట్టింట మొదలైంది. దీనిపై ఈఎస్‌పీఎన్-క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన ఫిలిప్స్.. ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రణాళిక ఏంటో వెల్లడించాడు.

‘టీ20 క్రికెట్‌లో నెగటివ్ మ్యాచ్‌అప్స్‌ను ఎదుర్కొనేందుకు నేను ఎడమచేత్తో బ్యాటింగ్‌ చేస్తున్నా. ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ ఎదుర్కొన్నప్పుడు కుడిచేత్తో ఆడితే బంతి దూరంగా వెళుతుంది. ఎడమచేత్తో బ్యాటింగ్ చేయడం వల్ల భారీగా పరుగులు అవకాశాలు ఉంటాయి. ఎడమచేత్తో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం నాకు ఇష్టం. రెండు చేతులతో ఆడడం వల్ల మన మెదడు రెండు వైపులా చురుగ్గా పనిచేస్తుంది. అవసరమైతే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోవచ్చు. చాలా ఏళ్లుగా ఎడమ చేత్తో సాధన చేస్తున్నా. మన ట్రైనింగ్‌పై నమ్మకం ఉండాలి. నేను చేసిన సన్నద్ధతపై నాకు నమ్మకం ఉంది. ఇక కోల్పోయేదేమీ లేని పరిస్థితుల్లోనే అలా ప్రయత్నిస్తా. చివరి కొన్ని ఓవర్లు మిగిలి ఉండగా.. సరదాగా ట్రై చేశాను. గత రెండు సంవత్సరాలుగా ఈ స్కిల్‌పై కష్టపడుతున్నా. టీ20 వరల్డ్‌కప్ 2026 దగ్గర పడుతుండటంతోనే దీన్ని మ్యాచ్‌లో ప్రయోగించా’ అని గ్లెన్ ఫిలిప్స్ చెప్పుకొచ్చాడు.

Also Read: Maa Inti Bangaram: మీరు చూస్తా ఉండండి.. సంక్రాంతికి సమంత సర్‌ప్రైజ్‌!

ప్రపంచకప్‌ 2026కు ముందు భారత్‌లో న్యూజిలాండ్ ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లాంటి స్పిన్ బౌలర్లతో కూడిన భారత బౌలింగ్ దళంపై గ్లెన్ ఫిలిప్స్ ఎలా ఆడతాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎడమ చేత్తోనూ బ్యాటింగ్ చేయగల ఈ కొత్త, అనూహ్యమైన శైలితో ఫిలిప్స్ టీ20 వరల్డ్‌కప్ 2026లో న్యూజిలాండ్‌కు ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా మారే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Exit mobile version