భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఖాతాలో మరో టైటిల్ చేరింది. స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీని పీవీ సింధు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ క్రీడాకారిణి బుసానన్‌పై 21-16, 21-8 తేడాతో పీవీ సింధు విజయం సాధించింది. 49 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో పీవీ సింధు సంపూర్ణ ఆధిపత్యం చేలాయించింది.
ఈ ఏడాది సింధు ఖాతాలో ఇది రెండో టైటిల్ విజయం. ఈ ఏడాది జనవరిలో సయ్యద్ మోదీ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీని పీవీ సింధు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల జర్మన్ ఓపెన్, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ టోర్నీలలో ఓటమి పాలైన పీవీ సింధు తాజాగా స్విస్ఓపెన్లో తిరుగులేని విజయాలను సాధించడంతో ఊరట లభించింది. కాగా స్విస్ ఓపెన్ టోర్నీలో అద్భుత ఆటతీరు కనబర్చిన సింధును కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి అభినందించారు. సింధు కీర్తికిరీటంలో మరో ఘనత చేరిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు.
మరోవైపు స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌లో భారత యువ షట్లర్ ప్రణయ్ పోరాటం ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇండోనేషియాకు చెందిన జొనాథన్ క్రిస్టీతో తలపడిన ప్రణయ్ 21-12, 21-18 తేడాతో ఓడిపోయాడు.
