Site icon NTV Telugu

Sunil Gavaskar: అతడు ఫామ్‌లో ఉన్నాడు.. టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లో ఉండాలి

Sunil Gavaskar Supports Dinesh

Sunil Gavaskar Supports Dinesh

ఈ ఏడాది ఐపీఎల్‌లో దినేశ్ కార్తీక్ ఎలా చెలరేగిపోతున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా.. ఎన్నో మెరుపులు మెరిపించాడు. చాలాసార్లు జట్టు విజయాల్లోనూ కీలక పాత్ర పోషించాడు. మునుపెన్నడూ లేని రౌద్ర రూపం దాల్చి, మైదానంలో తాండవం చేస్తున్నాడు. ఆర్సీబీ జట్టుకి బెస్ట్ ఫినిషర్‌గా మారాడు. ఈ నేపథ్యంలోనే.. కార్తీక్‌ను తిరిగి టీమిండియాలో తీసుకోవాల్సిందిగా మద్దతులు లభిస్తున్నాయి. టీ20 ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు కాబట్టి.. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు కార్తీక్‌ను ఎంపిక చేయాలని క్రికెట్ ప్రియులతో పాటు మాజీలు, క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ జాబితాలో తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేరిపోయాడు. టీమిండియాలోకి కంబ్యాక్ ఇచ్చేందుకు దినేశ్ కార్తీక్ చాలా కష్టపడుతున్నాడని అన్నాడు. తాను గతేడాది కార్తీక్‌తో చాలా సమయం గడిపానని, సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో 10-12 రోజులు పాటు తామిద్దరం క్వారంటైన్‌లో గడిపామని, అప్పుడతడు తిరిగి మళ్లీ భారత జట్టులోకి రావడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాడని ఆయనన్నాడు. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ జట్టుకు ఆడాలాని కార్తీక్‌ భావించాడు కానీ, అతని కోరిక అప్పుడు నెరవేరలేదన్నాడు. బహుశా ఈ ఏడాది అది నేరవేరవచ్చని, ఎందుకంటే కార్తీక్ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడని వెల్లడించాడు.

‘‘దినేశ్ కార్తీక్ ఆటతీరుని చూస్తుంటే, అతడు తిరిగి ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడని అర్థం చేసుకోవచ్చు. ఆర్సీబీ జట్టుకి బెస్ట్ ఫినిషర్‌గానూ నిలిచాడు. కాబట్టి అతడు కచ్చితంగా భారత టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉంటాడని నేను నమ్ముతున్నాను” అని ఓ ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు. మరి, ఆయన చెప్పినట్టు దినేశ్‌కి టీమిండియాలో చోటు దక్కుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ! కాగా.. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్‌ 274 పరుగులు సాధించాడు.

Exit mobile version