Sunil Gavaskar on Shubman Gill Captaincy: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ బ్యాటింగ్ ఆర్డర్‌లో చేసిన ఓ ప్రయోగంపై చర్చ జరుగుతోంది. కేవలం 135 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఓ దశలో 39/3తో కష్టాల్లో పడింది. స్టార్లు శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆ తర్వాత 47 పరుగుల వద్ద నాలుగో వికెట్‌గా అక్షర్ పటేల్ కూడా ఔటయ్యాడు. కేఎల్ రాహుల్ కంటే ముందుగా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్.. కేవలం 7 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.
అక్షర్ పటేల్‌ను కేఎల్ రాహుల్ కంటే ముందుగా పంపిన నిర్ణయంపై కొందరు క్రికెట్ అభిమానులు, నెటిజెన్స్ విమర్శలు గుప్పించారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీసుకున్న ఈ నిర్ణయం మ్యాచ్‌లో భారత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టిందని అభిప్రాయపడ్డారు. అయితే టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం ఈ ప్రయోగాన్ని సమర్థించారు. అక్షర్‌ను ముందుగా పంపడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్ అనంతరం మాట్లాడిన గవాస్కర్.. ‘లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజులోకి వచ్చినప్పుడు బౌలర్లు కాస్త ఇబ్బంది పడతారు. రైట్ హ్యాండ్ బ్యాటర్‌కు వేసే లైన్, లెంగ్త్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది. అలా మార్చే క్రమంలో రైట్ హ్యాండ్ బ్యాటర్‌కు కూడా పరుగులు చేసే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటారు’ అని పేర్కొన్నారు.
అక్షర్ పటేల్ పరుగులు చేసి ఉంటే కెప్టెన్సీ నిర్ణయం ఎంత బాగుందో అని అందరూ ప్రశంసించేవారని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ‘ఆ నిర్ణయం వెనుక సరైన ఆలోచన ఉంది. కొన్నిసార్లు ఇలాంటి ప్రయోగాలు ఫలిస్తాయి, మరికొన్నిసార్లు ఫలించవు. ఈసారి అది ఫెయిల్ అయింది. అయినప్పటికీ ఆ తర్వాత కేఎల్ రాహుల్ వంటి టాప్ బ్యాటర్ ఉన్నాడనే నమ్మకం జట్టుకు ఉంది. అందుకే కొన్నిసార్లు ఇలాంటి ప్రయోగాలు చేస్తారు. ఇందులో తప్పేమీ లేదు’ అని గవాస్కర్ వివరించారు. అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా పంపడం భారత్‌కు కొత్తేమీ కాదు. 2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లోనూ కీలక పరిస్థితుల్లో అతడిని ముందుగా పంపించారు. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీతో కలిసి అక్షర్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అలాగే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత జట్టు తరఫున కూడా అక్షర్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఆ టోర్నీలో రాహుల్ కంటే ముందుగానే అతడికి అవకాశం కల్పించారు.
రెండో వన్డేలో అక్షర్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్.. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కీలక భాగస్వామ్యంతో భారత్‌ను విజయానికి చేరువ చేశారు. భారత్ 26 ఓవర్లలో 113/7 స్కోరు వద్ద ఉన్న సమయంలో వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్ పద్ధతిలో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. అక్షర్‌ను ముందుగా పంపిన ప్రయోగం ఫలించకపోయినా.. భారత్ విజయం సాధించింది.

