Sourav Ganguly To Play Charity Match In Legends League Cricket: బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీకి తిరిగి మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్‌సీ)లో భాగంగా ఒక మ్యాచ్ ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించాడు. ‘‘ఆజాదీకా మహోత్సవ్‌లో భాగంగా నిర్వహించనున్న ఛారిటీ ఫండ్ రైజింగ్ గేమ్ కోసం సిద్ధమవుతున్నా. 75 సంవత్సరాల భారత స్వాతంత్రం, అలాగే మహిళా సాధికారత కోసం టాప్ లెజెండ్స్‌తో కలిసి లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో కొన్ని షాట్లు బాదేందుకు రెడీ అవుతున్నా’’ అంటూ ఇన్‌స్టా్గ్రామ్ మాధ్యమంగా తాను జిమ్‌లో కసరత్తు చేస్తోన్న ఫోటోలు సహా పోస్ట్ చేశాడు.
నిజానికి.. మొదట్లో గంగూలీ ఈ మ్యాచ్ ఆడకూడదని అనుకున్నాడు. బిజీ షెడ్యూల్ కారణంగా దూరంగా ఉండాలని భావించాడు. కానీ, ఆ తర్వాత మనసు మార్చుకొని రంగంలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే.. గుంగూలీ ఆడేందుకు ఒప్పుకోవడం సంతోషాన్ని కలిగించిందని లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు రామన్ రహెజా తెలిపాడు. ‘‘ఒక లెజెండ్ ఎప్పుడు లెజెండ్‌గానే ఉంటాడు. క్రికెట్ కోసం దాదా ఎప్పుడు అండగా ఉంటాడు. ఈసారి అతను ఓ ఛారిటీ కోసం మ్యాచ్ ఆడబోతున్నాడు. ఇది మన ఆడియన్స్‌కి ఓ అద్భుతమైన ఘట్టం కానుంది. అతని ఐకానిక్ షాట్లు చూసేందుకు మేమంతా ఆతృతగా ఎదురుచూస్తున్నాం’’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.