NTV Telugu Site icon

Shakib Al Hasan: మళ్లీ అతనికే కెప్టెన్సీ పగ్గాలు..

934137 Shakib 2

934137 Shakib 2

సంచలనాల జట్టు బాంగ్లాదేశ్ క్రికెట్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. పేలవమైన ఫామ్ వల్ల మోమినుల్ హక్ బంగ్లాదేశ్ కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు గురువారం మూడోసారి టెస్ట్ కెప్టెన్‌గా ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్‌ను నియమించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ నెలాఖరులో వెస్టిండీస్‌లో రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఇక ఈ సిరీస్‌కు ముందు షకీబ్‌ను కెప్టెన్‌గా నియమించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బ్యాట్స్‌మన్ లిటన్ దాస్‌ను కొత్త వైస్ కెప్టెన్‌గా నియమించింది. తదుపరి నిర్ణయం తీసుకునే దాకా వారు ఈ పొజిషన్లో కొనసాగుతరాని BCB అధ్యక్షుడు నజ్ముల్ హసన్ విలేకరుల సమావేశంలో తెలిపారు.

35 ఏళ్ల షకీబ్‌ ఆల్ హసన్ టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. 2009లో నియమితుడైన అతను జింబాబ్వేలో సిరీస్ ఓడిపోయిన తర్వాత 2011లో ఆ పదవి నుంచి వైదొలిగాడు. 2017లో రెండోసారి కెప్టెన్సీ చేపట్టాడు. 2019లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అతనిపై నిషేధం విధించే వరకు కెప్టెన్సీ పగ్గాలను అతనే నిర్వహించాడు. తర్వాత కెప్టెన్సీ కోల్పోయాడు. ఇక మళ్లీ ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు. షకీబ్ బంగ్లాదేశ్‌ టెస్టు జట్టుకు 14 మ్యాచ్‌లలో కెప్టెన్సీ నిర్వహించాడు. ఇందులో మూడింట్లో బంగ్లాదేశ్ గెలవగా.. 11 మ్యాచ్‌లలో ఓడింది. జూన్ 5న షకీబ్ కెప్టెన్సీలో బంగ్లా జట్టు వెస్టిండీస్‌కు వెళ్లనుంది. మరి ఈసారైనా పూర్తిస్థాయి నాయకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తాడో లేదో చూడాలి.