Shahrukh Khan: చరిత్ర సృష్టించిన ‘షారుఖ్’ నైట్ రైడర్స్.. సొంత క్రికెట్ స్టేడియం ఏర్పాటు!

  • నైట్ రైడర్స్ గ్రూప్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత
  • ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తొలి క్రికెట్ ఫ్రాంచైజీ
  • అంతర్జాతీయ ప్రమాణాల క్రికెట్ స్టేడియం
Knight Riders Cricket Ground, Los Angeles

Knight Riders Cricket Ground, Los Angeles

Knight Riders Group Cricket Ground in Los Angeles: బాలీవుడ్ ‘సూపర్ స్టార్’ షారుఖ్ ఖాన్ సహ యాజమాన్యంలో ఉన్న నైట్ రైడర్స్ గ్రూప్ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తొలి క్రికెట్ ఫ్రాంచైజీగా అమెరికాలో సొంత అంతర్జాతీయ ప్రమాణాల క్రికెట్ స్టేడియాన్ని నిర్మించి చరిత్ర సృష్టించింది. లాస్ ఏంజెల్స్‌లో తొలి మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్‌సీ) మ్యాచ్‌కు నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యం ఇవ్వడంతో ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ మధ్య జరిగిన మ్యాచ్‌తో ఈ స్టేడియం అధికారికంగా ప్రారంభమైంది. ఇది కేవలం కొత్త మైదానం ప్రారంభం మాత్రమే కాదు.. అమెరికాలో క్రికెట్ అభివృద్ధికి దీర్ఘకాలిక పెట్టుబడులతో నైట్ రైడర్స్ గ్రూప్ చేపట్టిన భారీ ప్రణాళికకు నాంది అని నిర్వాహకులు పేర్కొన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఈ స్టేడియంలో ఆటగాళ్లు, అభిమానులకు అత్యుత్తమ అనుభూతిని అందించేలా అన్ని సౌకర్యాలు కల్పించారు. ప్రధాన మైదానంలో ఎనిమిది పిచ్‌లు, ఐసీసీ ప్రమాణాలకు అనుగుణమైన మైదాన కొలతలు, 120 అడుగుల ఎత్తులో ఆరు ఫ్లడ్‌లైట్ టవర్లు ఏర్పాటు చేశారు. ఈ స్టేడియం నిర్మాణం కోసం 32 వేల మెట్రిక్ టన్నులకు పైగా మట్టిని తరలించి అత్యాధునిక క్రికెట్ వేదికను సిద్ధం చేశారు.

ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ… ‘ఒకప్పుడు కలగా మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు నిజమైంది. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే క్రీడల్లో రెండో స్థానంలో ఉన్న క్రికెట్‌ను లాస్ ఏంజెల్స్‌కు తీసుకురావడం ఎంతో గర్వకారణం. ఫెయిర్‌ప్లెక్స్‌తో కలిసి మేము కేవలం క్రికెట్ స్టేడియాన్ని మాత్రమే నిర్మించడం లేదు. కుటుంబాలు, అభిమానులు, వినోదం, సామాజిక బంధాలకు కేంద్రంగా నిలిచే వేదికను రూపొందించాం. ఇది లాస్ ఏంజెల్స్‌లో క్రికెట్‌కు శాశ్వత నిలయంగా మారాలని, భవిష్యత్ తరాలను ప్రేరేపించాలని కోరుకుంటున్నాం’ అని అన్నారు.

నైట్ రైడర్స్ స్పోర్ట్స్ సీఈఓ వెంకీ మైసూర్ కూడా ఈ ఘనతపై ఆనందం వ్యక్తం చేశారు. ‘లాస్ ఏంజెల్స్‌లోని నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్ కేవలం ఒక స్టేడియం కాదు.. క్రికెట్ భవిష్యత్తుపై మా దృఢ సంకల్పానికి ప్రతీక. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల ద్వారానే క్రికెట్ మరింత విస్తరిస్తుందని మేము నమ్ముతున్నాం. ఆటగాళ్లు ఆడాలని కోరుకునే, అభిమానులు సందర్శించాలని ఆశించే, స్థానికులు తమ సొంత క్రికెట్ మైదానంగా భావించేలా దీన్ని రూపొందించాం’ అని చెప్పారు. ఈ ప్రారంభ వేడుకకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చేలా అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం, ఎన్‌బీఏ ఛాంపియన్ మెట్టా వరల్డ్ పీస్ (రాన్ ఆర్టెస్ట్) తొలి మ్యాచ్‌లో తొలి బంతిని విసిరారు. ఆయన హాజరు అమెరికాలో క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణను, ప్రధాన క్రీడలతో క్రికెట్‌కు ఏర్పడుతున్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తోందని నిర్వాహకులు పేర్కొన్నారు.

జూలై 1 నుంచి జూలై 5 వరకు ఈ స్టేడియంలో మేజర్ లీగ్ క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నీ ద్వారా లాస్ ఏంజెల్స్‌లో అత్యున్నత స్థాయి టీ20 క్రికెట్ అభిమానులకు చేరువ కానుండగా.. అమెరికాలో క్రికెట్ విస్తరణకు ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుంది. షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్ గ్రూప్ ఈ చారిత్రక అడుగుతో ప్రపంచ క్రికెట్‌లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.