దేశవాళీ క్రికెట్‌లో దాదాపు 11 ఏళ్ల పాటు కష్టపడి ఎట్టకేలకు టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న మధ్యప్రదేశ్ ఆఫ్‌స్పిన్నర్ సారాంశ్ జైన్ తన క్రికెట్ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలో శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపికైన 33 ఏళ్ల సారాంశ్.. భారత జట్టులో చోటు దక్కాలంటే ప్రతిభతో పాటు ఓపిక, కష్టపడే తత్వం కూడా ఎంతో అవసరమని చెప్పాడు. జట్టులోని చాలా మందితో ఇదివరకే ఆడానని, దాంతో టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో పెద్దగా తేడా అనిపించలేదని చెప్పుకొచ్చాడు. భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు ఆగస్టు 15న గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో సారాంశ్ జైన్‌కు తొలిసారి చోటు దక్కింది.
భారత జట్టులో తన ఎంపిక విషయం తెలిసిన సమయంలో తాను ఆలయానికి వెళ్తున్నానని.. మార్గమధ్యలో ఫోన్‌లో వచ్చిన వరుస కాల్స్, మెసేజ్‌లను చూసిన తర్వాతే టీమిండియాకు ఎంపికైన సంగతి తెలిసిందని సారాంశ్ జైన్ గుర్తుచేసుకున్నాడు. బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో సారాంశ్ మాట్లాడుతూ.. ‘నేను ఆలయానికి వెళ్తున్నాను. డ్రైవ్ చేస్తున్న సమయంలో ఫోన్‌లో కాల్స్, మెసేజ్‌లు చూశాను. అప్పుడు నేను భారత జట్టుకు ఎంపికయ్యానని తెలిసింది’ అని చెప్పాడు. దేశవాళీ క్రికెట్‌లో సుదీర్ఘ అనుభవం ఉన్న సారాంశ్.. భారత జట్టులోకి వచ్చిన తర్వాత పెద్దగా ఒత్తిడికి గురికాలేదని చెప్పాడు. అందుకు ప్రధాన కారణం ప్రస్తుతం జట్టులో ఉన్న పలువురు ఆటగాళ్లతో గతంలోనే కలిసి ఆడటం. రంజీ ట్రోఫీలో ఎన్నో సంవత్సరాలు ఆడిన అనుభవం తనకు ఉండటంతో కొత్త వాతావరణంగా అనిపించలేదని వివరించాడు.
‘నేను జట్టులో చేరిన మూడు రోజులకే పెద్దగా తేడా అనిపించలేదు. ఇక్కడ ఉన్న 70-80 శాతం మంది ఆటగాళ్లతో నేను ఇప్పటికే క్రికెట్ ఆడాను. అందుకే అందరితో త్వరగానే కలిసిపోయాను. టెస్టు క్రికెట్‌లో ఓపిక చాలా అవసరం. మీరు భారత్ తరఫున టెస్టులు ఆడాలని అనుకుంటే ఖచ్చితంగా ఓపికగా ఉండాలి. నేను కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఓపికతోనే ఎదురు చూశాను. 2014-15లో రంజీ ట్రోఫీ అరంగేట్రం చేశాను. అప్పటి నుంచి చూస్తే ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. ఇందులో ఎంతో కష్టం, త్యాగాలు ఉన్నాయి. కానీ ఒక రోజు నేను భారత్ తరఫున తప్పకుండా ఆడతాననే నమ్మకం ఎప్పుడూ ఉండేది’ అని సారాంశ్ చెప్పాడు.
సారాంశ్ జైన్ క్రికెట్ ప్రయాణంలో అతడి కుటుంబం కీలక పాత్ర పోషించింది. ‘నా కుటుంబం ఎప్పుడూ నాకు అండగా ఉంది. నా నాన్న కూడా రంజీ ట్రోఫీ ఆటగాడే. ఆయన ఎప్పుడూ ఓపికగా ఉండాలని చెప్పేవారు. సమయం వచ్చినప్పుడు అవకాశాలు వాటంతట అవే వస్తాయని చెప్పేవారు. అని సారాంశ్ పేర్కొన్నాడు. ఎడమచేతి వాటం బ్యాటర్ అయిన సారాంశ్ భారత్-ఏ జట్లలోనూ చోటు దక్కించుకున్నాడు. 54 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 2223 పరుగులు, 188 వికెట్లు సాధించాడు. 2022 ఏడాది అతడి కెరీర్‌లో కీలక మలుపు. ఆ సీజన్‌లో 13 వికెట్లు తీయడంతో పాటు నాకౌట్ దశలో కీలక అర్ధశతకం సాధించి మధ్యప్రదేశ్ తొలి రంజీ ట్రోఫీ టైటిల్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు.
2025-26 సీజన్ సారాంశ్ కెరీర్‌లో మరో అద్భుతమైన సీజన్‌గా నిలిచింది. ఆ సీజన్‌లో 518 పరుగులు, 30 వికెట్లు సాధించాడు. అతడి బ్యాటింగ్ సగటు 57.55గా ఉండగా.. బౌలింగ్‌లో 20.43 సగటుతో వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ తరఫున అద్భుత ప్రదర్శన చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు. రెండు మ్యాచ్‌ల్లోనే 16 వికెట్లు తీసి, రెండు అర్ధశతకాలు సాధించాడు. గతంలో న్యూచండీగఢ్‌లో భారత్-అఫ్గానిస్థాన్ మ్యాచ్ సందర్భంగా టీమిండియాకు నెట్ బౌలర్‌గా కూడా సేవలందించాడు. ఇప్పుడు సారాంశ్.. భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకుని అంతర్జాతీయ అరంగేట్రానికి అడుగు దూరంలో నిలిచాడు. 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ఇప్పుడు ఫలితం దక్కే సమయం వచ్చింది.

