Sachin Tendulkar-ICC: హ్యాట్సాఫ్.. ఐసీసీపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు!

  • మహిళా క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ మరో కీలక అడుగు
  • రిటర్న్ టు ప్లే పోస్ట్-ప్రెగ్నెన్సీ గైడ్‌లైన్స్
  • ప్రసవం తర్వాత 16 వారాల వ్యవధిలో పునరాగమన ప్రక్రియ
  • ఐసీసీపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు
Sachin Tendulkar

Sachin Tendulkar

Sachin Praises ICC’s Landmark Decision: మహిళా క్రికెట్ అభివృద్ధికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో కీలక అడుగు వేసింది. ప్రసవం అనంతరం మహిళా క్రికెటర్లు సురక్షితంగా, సమర్థవంతంగా మళ్లీ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి ప్రత్యేక మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. ఐసీసీ నిర్ణయాన్ని భారత క్రికెట్ దిగ్గజం, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ హర్షం వ్యక్తం చేశారు. మహిళా క్రికెటర్ల భవిష్యత్తుకు ఇది భారీ ఊరట అని అభిప్రాయపడ్డారు.

ప్రసవం తర్వాత మహిళా ఆటగాళ్లు ఎదుర్కొనే శారీరక, మానసిక సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ‘రిటర్న్ టు ప్లే పోస్ట్-ప్రెగ్నెన్సీ గైడ్‌లైన్స్’ను ఐసీసీ రూపొందించింది. ఈ మార్గదర్శకాలు ప్రసవం తర్వాత 16 వారాల వ్యవధిలో ప్లేయర్స్ పునరాగమన ప్రక్రియను క్రమబద్ధంగా నిర్వహించేందుకు ఉపయోగపడనున్నాయి. ఇందులో శారీరక పునరుద్ధరణ, ఫిట్‌నెస్, మానసిక ఆరోగ్యం, శిక్షణ తదితర అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ మార్గదర్శకాల్లో ‘సిక్స్ ఆర్’ (6R) ఫ్రేమ్‌వర్క్‌ను ఐసీసీ ప్రవేశపెట్టింది. ఇందులో Ready, Review, Restore, Recondition, Return, Refine అనే ఆరు దశలు ఉంటాయి. ఈ ప్రక్రియ ద్వారా మహిళా క్రికెటర్లు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. క్రమంగా మళ్లీ పోటీ క్రికెట్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది.

×
×
Ad

ఐసీసీ నిర్ణయంపై సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ‘క్రీడల్లో సాధికారత అంటే ఆటగాళ్ల జీవిత ప్రయాణంలోని ప్రతి దశకు సరైన మద్దతు ఉండటం. ఒకటి ఎంచుకోవడం నుంచి రెండింటినీ సాధించడం అనే స్థాయికి మహిళా క్రీడాకారులు చేరడం ఎంతో సంతోషకరం. మహిళా క్రికెటర్ల భవిష్యత్తుకు ఇది భారీ ప్రోత్సాహం’ అని సచిన్ పేర్కొన్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రసవం అనంతరం తిరిగి క్రికెట్ ఆడే ప్రతి ఆటగాడికి ఒక ప్రత్యేక ‘కేస్ మేనేజర్’ను నియమించనున్నారు. ఈ బాధ్యతను వైద్యుడు లేదా ఫిజియోథెరపిస్ట్ నిర్వహిస్తారు. ఆటగాడి శారీరక, మానసిక పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తూ తిరిగి మైదానంలోకి రావడానికి అవసరమైన మార్గనిర్దేశం చేస్తారు.

ప్రసవం తర్వాత తొలి దశలో మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. తల్లిగా కొత్త జీవితానికి అలవాటు పడే క్రమంలో ఆటగాళ్లకు మానసిక సహాయం అందించబడుతుంది. అనంతరం క్రమంగా శక్తి పెంపు వ్యాయామాలు, ఫిట్‌నెస్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఎనిమిది వారాల తర్వాత వైద్యులు, ఫిజియోథెరపిస్టుల పర్యవేక్షణలో పరుగులు, ఇతర శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కండరాల సమస్యలు, పెల్విక్ ఫ్లోర్ ఇబ్బందులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనే విషయాన్ని నిరంతరం పరిశీలిస్తారు. అన్ని పరీక్షల్లో సానుకూల ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే ఆటగాళ్లకు మళ్లీ పోటీ క్రికెట్ ఆడేందుకు అనుమతి ఇస్తారు. స్థానిక చట్టాలకు అనుగుణంగా రూపొందించిన ఈ మార్గదర్శకాలు మహిళా క్రికెటర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడినట్లు ఐసీసీ వెల్లడించింది. మహిళా క్రీడాకారులు కుటుంబ జీవితాన్ని, వృత్తిపరమైన క్రీడా జీవితాన్ని సమతుల్యం చేసుకునేందుకు ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.