SA vs NZ Semi-Final 2026 Head-to-Head: టీ20 ప్రపంచ కప్ 2026లో రసవత్తర సమరానికి వేళైంది. తొలి సెమీ ఫైనల్లో నేడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. మెగా టోర్నీలో అపజయమే లేని దక్షిణాఫ్రికా.. అద్భుత ఆటతో సెమీస్ చేరింది. మరోవైపు కివీస్ కష్టంగానే ముందంజ వేసింది. సఫారీ టీమ్ దుర్భేద్యంగా కనిపిస్తున్నన్నా.. న్యూజిలాండ్‌ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. రెండు జట్లూ తొలి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆసక్తి రేపుతోంది. తొలి సెమీ ఫైనల్ పోరు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. మ్యాచ్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ టీమ్స్ హెడ్ టు హెడ్, ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్ ఓసారి చూద్దాం.
అద్భుతమైన ఫామ్‌లో దక్షిణాఫ్రికా:
టీ20 ప్రపంచ కప్ 2026లో దక్షిణాఫ్రికా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. గ్రూపు, సూపర్ 8లో ఓడిపోలేదు. అద్భుత బ్యాటింగ్ లైనప్ సఫారీ జట్టుకు ఉంది. టాప్ ఆర్డర్ భారీగా రన్స్ చేస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. మూడు అర్ధసెంచరీలతో 268 పరుగులు చేశాడు. రికెల్టన్ 228 పరుగులు చేశాడు. డికాక్ కూడా పర్వాలేదనిపిస్తునాడు. బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, యాన్సెన్‌లతో మిడిల్ ఆర్డర్ బలంగా ఉంది. రబాడ, ఎంగిడి, బోష్, యాన్సెన్, మహరాజ్‌లతో బౌలింగ్ బాగుంది.
కివీస్ పుంజుకోవాల్సిందే:
సూపర్ 8లో న్యూజిలాండ్ ఇతర ఫలితాలపై ఆధారపడాల్సివచ్చింది. కివీస్‌కు కూడా మంచి లైనప్ ఉంది. ఓపెనర్ సీఫెర్ట్ 216 పరుగులు చేశాడు. ఫైన్ అలెన్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఫిలిప్స్, రచిన్, మిచెల్ బ్యాట్ ఝళిపించడం కివీస్‌కు చాలా అవసరం. కెప్టెన్ శాంట్నర్ బ్యాటుతోనూ మంచి ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. స్పిన్నర్లు శాంట్నర్, రచిన్, ఫిలిప్స్ సమష్టిగా రాణిస్తున్నారు. ఫాస్ట్‌బౌలర్ ఫెర్గూసన్ బౌలింగ్ న్యూజిలాండ్‌కు చాలా కీలకం. నీషమ్, డఫీలు ఎలా ఆడుతారో చూడాలి.
పిచ్ రిపోర్ట్:
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. నేడు భారీ స్కోర్లు నమోదు కావొచ్చు. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. సెమీఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే.. సూపర్ 8లో మెరుగైన టీమ్ ఫైనల్ చేరుతుంది. సూపర్-8లో దక్షిణాఫ్రికా ఆరు పాయింట్స్ సాధించగా.. కివీస్‌కు 3 పాయింట్లే ఉన్నాయి.
దక్షిణాఫ్రికాదే పైచేయి:
టీ20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడ్డ ఐదు మ్యాచ్‌లలో తలపడ్డాయి. అన్ని మ్యాచ్‌ల్లో సఫారీలే గెలిచారు. టీ20 మ్యాచ్‌లలో మొత్తం 19 సార్లు ఇరు జట్లు తలపడ్డాయి. ఇందులో దక్షిణాఫ్రికా 12, న్యూజిలాండ్ 7 గెలిచింది. ఎలా చూసినా న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికాదే పైచేయిగా ఉంది.
తుది జట్లు (అంచనా):
దక్షిణాఫ్రికా: డికాక్, రికెల్టన్, మార్‌క్రమ్ (కెప్టెన్), బ్రెవిస్, మిల్లర్, స్టబ్స్, యాన్సెన్, బోష్, కేశవ్ మహరాజ్, రబాడ, ఎంగిడి.
న్యూజిలాండ్: అలెన్, సీఫర్ట్, రచిన్ రవీంద్ర, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, శాంట్నర్ (కెప్టెన్), నీషమ్, డఫీ, ఫెర్గూసన్, ఇష్ సోధి.
