Site icon NTV Telugu

World Cup Final: సింగిల్ రూంకి రూ.1.25 లక్షలు.. చుక్కల్ని అంటుతున్న హోటల్ రేట్లు, విమాన ఛార్జీలు..

World Cup Final

World Cup Final

World Cup Final: వరల్డ్ కప్ అంతిమ సమరం ఆదివారం జరగబోతోంది. ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. రోహిత్ సేన వన్డే వరల్డ్ కప్ గెలవాలని యావత్ దేశం కోరుకుంటోంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఈ ఫైనల్ జరగబోతోంది. దేశం మొత్తం కూడా క్రికెట్ ఫీవర్ నెలకొని ఉంది.

ఇదిలా ఉంటే అహ్మదాబాద్‌లో మాత్రం హోటల్ రేట్లు చుక్కల్ని అంటుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే కొన్ని రెట్లు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇదే కాకుండా విమాన ఛార్జీలు కూడా పెరిగాయి. అహ్మదాబాద్ లోని ఫైవ్ స్టార్ హోటళ్లు మ్యాచ్ జరిగే రాత్రి రూమ్‌ల ధరల్ని అమాంతం పెంచాయి. హోటల్ రూమ్స్ టారిఫ్‌లు రూ. 2 లక్షలకు పెరిగింది. ఇది కాకుండా సాధారణ హోటళ్లు కూడా ఐదు నుంచి ఏడు రెట్లు ధరల్ని పెంచాయి.

ఫైనల్ మ్యాచ్ కోసం ఒక్క మనదేశం వాళ్లే కాకుండా దుబాయ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి విదేశాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారని.. గుజరాత్ లోని ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేంద్ర సోమాని తెలిపారు. అహ్మదాబాద్ లోని త్రీస్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో 5000 గదులు ఉన్నాయి, మొత్తం గుజరాత్ వ్యాప్తంగా చూస్తే 10,000 గదులు ఉన్నా్యి. నరేంద్రమోడీ స్టేడియం సామర్థ్యం 1.20 లక్షలుగా ఉంది, స్థానికులతో పాటు ఫైనల్ చూడటానికి 30,000-40,000 మంది బయట నుంచి వస్తారని ఆయన అంచనా వేశారు. దీంతో హోటల్ గదులకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. ఇదివరకు నామమాత్రంగా లభించే సింగిల్ రూం ధరలు ఇప్పుడు రూ. 50 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు పలుకుతున్నాయి.

Read Also: Buy a car on Amazon: అమెజాన్‌లో కారు కొనుగోలు చేయాలా.? త్వరలో వాస్తవం కాబోతోంది..

వివిధ హోటల్ బుకింగ్స్ సైట్లలో ఆన్‌లైన్ రేట్లు రాత్రికి దాదాపు రూ. 2లక్షలకు చేరుకున్నాయి. ఐటీసీ నర్మదా, హయత్ రీజెన్సీ వంటి హోటళ్లు ఆన్‌లైన్ టారిఫ్‌లు మ్యాచ్ జరిగే రోజు రాత్రికి రూ. 2 లక్షలకు పైగా ఉంది. క్రికెట్ క్రేజ్‌ని క్యాష్ చేసుకునేందుకు అన్ని స్టార్ హోటల్స్‌తో పాటు ఇతర హోటళ్లు కూడా భారీగా ధరలు పెంచాయి. సాధారణంగా ఒక రాత్రికి రూ. 3000 నుంచి రూ.4000 ఉండే సీజీ రోడ్ లోని హోటల్ క్రౌన్‌లో రేట్లు ఇప్పుడు రూ.20,000గా ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే వివిధ ప్రాంతాల నుంచి అహ్మదాబాద్‌కి విమాన ఛార్జీలు సాధారణ ఛార్జీలతో పోలిస్తే భారీగా పెరిగాయి. చెన్నై నుంచి వచ్చే విమానాల ధరలు సాధారణ రోజుల్లో రూ. 5000 ఉంటే, ప్రస్తుతం రూ.16,000 నుంచి రూ. 25,000 వరకు ఉన్నాయి. అన్ని విమానయాన సంస్థలు అహ్మదాబాద్ ఫ్లైట్ రేట్లను మూడు నుంచి 5 రెట్లు పెంచాయని ట్రావెల్ ఏజెంట్ మనుభాయ్ పంచోలీ చెప్పారు. జీవితంలో ఒక్కసారి లభించే అవకాశం కావడంతో క్రికెట్ అభిమానులు ఎక్కువ ధర చెల్లించేందుకు కూడా సిద్ధమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version