సాధారణంగా క్రికెట్‌లో గోల్డెన్ డక్ అంటే అందరికీ తెలుసు.. కానీ డైమండ్ డక్ అంటే చాలా మందికి తెలియదు. అయితే ఆదివారం సన్‌రైజర్స్, ఆర్‌సీబీ మ్యాచ్ చూసిన వాళ్లకు డైమండ్ డక్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ డైమండ్ డక్ అయ్యాడు. ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే అవుటైతే దానిని డైమండ్ డక్ అంటారు. ఇన్నింగ్స్ తొలి బంతికే అభిషేక్ శర్మతో సమన్వయ లోపం కారణంగా విలియమ్సన్ ఖాతా తెరవకుండానే రనౌట్ అయ్యాడు. గతంలో పలువురు క్రికెటర్లు డైమండ్ డక్ అయినా ఇవాళ్టి విలియమ్సన్ అవుట్ మాత్రం గుర్తుండిపోతుంది.
కాగా ఈ మ్యాచ్‌లో 193 పరుగుల భారీ లక్ష్యంతో సన్‌రైజర్స్ బరిలోకి దిగగా.. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు పడ్డాయి. రాహుల్ త్రిపాఠి 58 పరుగులు చేసినా రన్‌రేట్ క్రమంగా పెరిగిపోయింది. మార్‌క్రమ్ 21 పరుగులు, నికోలస్ పూరన్ 19 పరుగులు చేశారు. 104 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ మిగతా ఐదు వికెట్లను వేగంగా కోల్పోయింది. దీంతో 125 పరుగులకు ఆ జట్టు ఆలౌట్ కావడంతో ఆర్‌సీబీ 67 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో హసరంగ 5 వికెట్లతో చెలరేగాడు. హేజిల్‌వుడ్ 2 వికెట్లు తీయగా హర్షల్ పటేల్, మ్యాక్స్‌వెల్ తలో వికెట్ సాధించారు. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ నాలుగో స్థానానికి ఎగబాకింది. అటు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు వరుసగా ఇది నాలుగో ఓటమి. 11 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు ఐదు మ్యాచ్‌లు గెలిచి ఆరు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది.
