Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!

  • రాకీ ఫ్లింటాఫ్ సునామీ
  • 76 బంతుల్లో 123 పరుగులు
  • తండ్రి రికార్డులే టార్గెట్
  • రాకీ ఫ్లింటాఫ్‌పై భారీ అంచనాలు
Rocky Flintoff Century

Rocky Flintoff Century

Rocky Flintoff 65 Ball Century: ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ మరోసారి సత్తా చాటాడు. 18 ఏళ్ల వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. 2026 వన్డే కప్‌లో లాంకషైర్ తరఫున బరిలోకి దిగిన రాకీ.. సోమర్‌సెట్‌పై 65 బంతుల్లోనే సెంచరీ బాదాడు. మ్యాచ్‌లో మొత్తంగా 76 బంతుల్లో 123 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. రాకీ ఫ్లింటాఫ్‌ బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాకీ ఫ్లింటాఫ్‌తో పాటు కీటన్ జెన్నింగ్స్ కూడా సెంచరీతో చెలరేగాడు. జెన్నింగ్స్ 127 బంతుల్లో 156 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి శతకాలతో లాంకషైర్ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 443 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం సోమర్‌సెట్‌ను 174 పరుగుల తేడాతో లాంకషైర్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో రాకీ బ్యాటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాకీ ఇప్పటికే తన తండ్రి పేరుతో ఉన్న రికార్డులను అధిగమిస్తూ దూసుకెళుతున్నాడు. ఇప్పటివరకు ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 14 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. 2025లో ఇంగ్లండ్ లయన్స్ తరఫున క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌పై చారిత్రాత్మక సెంచరీ బాదాడు. అప్పటికి అతడి వయసు కేవలం 16 ఏళ్ల 291 రోజులు మాత్రమే. దీంతో ఇంగ్లండ్ లయన్స్ తరఫున తొలి సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

ఈ క్రమంలోనే రాకీ తన తండ్రి ఆండ్రూ ఫ్లింటాఫ్ రికార్డును కూడా అధిగమించాడు. ఆండ్రూ ఇంగ్లండ్ లయన్స్ తరఫున తన తొలి సెంచరీని 20 ఏళ్ల 28 రోజుల వయసులో చేశాడు. రాకీ కేవలం 16 ఏళ్ల వయసులోనే ఆ ఘనత అందుకోవడంతో.. చిన్న వయసులోనే లయన్స్ తరఫున సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఆండ్రూ ఇటీవల ఇంగ్లండ్ లయన్స్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. ఆస్ట్రేలియా టీ20 లీగ్ బిగ్ బాష్‌లో సిడ్నీ థండర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో లయన్స్ కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. దాదాపు 23 నెలల పాటు లయన్స్‌కు కోచ్‌గా వ్యవహరించిన ఫ్లింటాఫ్.. యువ ఆటగాళ్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు.

2024లో టాప్ గేర్ కార్యక్రమం చిత్రీకరణ సమయంలో జరిగిన కారు ప్రమాదం తర్వాత ఫ్లింటాఫ్ మళ్లీ క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అనంతరం ఇంగ్లండ్ లయన్స్‌తో పాటు ఇంగ్లండ్ సీనియర్ వైట్-బాల్ జట్టుతో కూడా పనిచేశాడు. 2024 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ జట్టు సహాయక సిబ్బందిలో భాగంగా ఉన్నాడు. అలాగే ఇంగ్లండ్ దేశవాళీ క్రికెట్‌లో నార్తర్న్ సూపర్‌చార్జర్స్‌కు కూడా కోచ్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు తండ్రి కోచ్‌గా మరో దేశంలో కొత్త బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతుండగా.. కొడుకు రాకీ మాత్రం మైదానంలో తన బ్యాట్‌తో అదరగొడుతున్నాడు. 18 ఏళ్ల వయసులోనే భారీ శతకాలతో ఆకట్టుకుంటున్న రాకీ.. భవిష్యత్తులో ఇంగ్లండ్ క్రికెట్‌లో కీలక ఆటగాడిగా అడగనున్నాడు.