Site icon NTV Telugu

IPL 2022: పేలవ ఫామ్‌లో విరాట్ కోహ్లీ.. అతడి ఆటతీరుపై పేలుతున్న మీమ్స్

Virat Kohli

Virat Kohli

ఐపీఎల్ 2022 సీజన్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ప్రదర్శన బాగానే ఉన్నా ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట తీరే అభిమానులను అసంతృప్తికి గురిచేస్తోంది. ఆర్‌సీబీ ఫ్రాంచైజీ రూ.15 కోట్లు కుమ్మరించి కోహ్లీని రిటైన్ చేసుకుంది. అయితే అతడు మాత్రం పేలవ ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయంగానూ కోహ్లీ విఫలమవుతున్నా.. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేస్తాడని బెంగళూరు ఫ్రాంచైజీ నమ్మకం పెట్టుకుంది. కానీ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 23.80గా ఉందంటే అతడి ప్రదర్శన ఏ లెవల్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మంగళవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో అయితే కోహ్లీ ఏకంగా గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగాడు. లక్నో బౌలర్ చమీరా వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీని బ్యాక్‌వర్డ్ పాయింట్ ఫీల్డర్ మీదుగా ఆడేందుకు ప్రయత్నించి క్యాచ్ అవుట్‌గా పెవిలియన్‌కు వెళ్లాడు. గత మూడేళ్లుగా కోహ్లీ ఆటతీరు చాలా మారింది. గతంలో దూకుడుగా బ్యాటింగ్ చేసే కోహ్లీ ఇప్పుడు రక్షణాత్మకంగా ఆడుతున్నాడు. దీంతో కోహ్లీ ఆటతీరుపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. విరాట్ పనైపోయిందని, రిటైర్మెంట్ ప్రకటించాలని పలువురు అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.

తాజాగా కోహ్లీ ఆటతీరుపై టీఎస్‌ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ కూడా సెటైర్ వేశారు. బస్‌ కండక్టర్‌.. ఎప్పుడైనా పాస్‌ అడిగినప్పుడు.. ఇంట్లో మరిచిపోయాం అని చాలా మంది చెప్తుంటారని.. అప్పుడు వాళ్లు పెట్టే ఎక్స్‌ ప్రెషన్స్‌ అచ్చం కోహ్లీ లాగే ఉంటాయని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు కోహ్లీ ఫోటోను సజ్జనార్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Exit mobile version