NTV Telugu Site icon

CSK vs RR: రాజస్థాన్ డబుల్ ధమాకా!

Rajasthan Double Dhamaka

Rajasthan Double Dhamaka

నిన్న రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడిన రాజస్థాన్ రాయల్స్ ‘డబుల్ ధమాకా’ కొట్టింది. తొలుత చెన్నైని 150 పరుగులకే కట్టడి చేసి ప్లేఆఫ్స్‌లో బెర్తు కన్ఫమ్ చేసుకున్న రాజస్థాన్.. ఆ తర్వాత విజయం సాధించి, పాయింట్ల టేబుల్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. లీగ్ దశలో టాప్-2లో నిలిచిన జట్టుకి.. ప్లేఆఫ్స్‌లో ఒక మ్యాచ్ ఓడినా, మరో అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే! లక్నో సూపర్ జెయింట్స్ కూడా 18 పాయింట్లు సాధించినా.. మెరుగైన రన్‌రేట్‌తో రాజస్థాన్ (0.298) రెండో స్థానాన్ని దక్కించుకుంది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ గెలిచిన చెన్నై జట్టు, బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్స్‌లో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. మోయిన్ అలీ ఒక్కడే 93 పరుగులతో చెలరేగిపోయాడు. చెన్నై బౌలర్స్‌కు ముచ్చెమటలు పట్టించారు. మిగతా బ్యాట్స్మన్లు కనీసం పోరాటపటిమ కూడా చూపించలేదు. కెప్టెన్ ధోనీ (26) కాస్త పర్వాలేదనిపిస్తే, మిగిలిన వాళ్ళందరూ వచ్చినట్టే వచ్చి, పెవిలియన్ చేరారు. రాజస్థాన్ తరఫున ఒక వికెట్ తీసుకొని ట్రెండ్ బౌల్ట్ ఒక్కడే భారీ పరుగులు (44) సమర్పించుకోగా, ఇతర బౌలర్లు బాగానే కంట్రోల్ చేశారు. చాహల్, మెక్‌కాయ్ చెరో రెండు వికెట్లు తీయగా.. అశ్విన్ ఒక వికెట్‌తో సరిపెట్టుకున్నాడు.

151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. శుభారంభాన్నే ఇచ్చింది. జాస్ బట్లర్ 2 పరుగులకే ఔట్ అవ్వగా.. యశస్వి జైస్వాల్ (44 బంతుల్లో 59 పరుగులు) బాగానే రాణించాడు. సంజూ శాంసన్ (20 బంతుల్లో 15 పరుగులు) కాసేపు క్రీజులో కుదురుకొని, అతనితో మంచి భాగస్వామ్యం జోడించాడు. అయితే, పవర్ ప్లే తర్వాత రాజస్థాన్ నెమ్మదించింది. వరుసగా శాంసన్, పడిక్కల్ వికెట్లు పడడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. యశస్వి, అశ్విన్ కాసేపు కుదురుగా రాణించారు. యశస్వి ఔటవ్వడం, హెట్‌మెయర్ కూడా వెనుదిరగడంతో.. ఇక రాజస్థాన్ గెలుపు కష్టమేనని అనిపించింది. అప్పుడు అశ్విన్ విజృంభించి, రెండు బంతులు మిగిలుండగానే జట్టుని గెలిపించాడు.