Site icon NTV Telugu

విరాట్ కోహ్లీకి అండగా నిలిచిన రాహుల్ గాంధీ

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా పరాజయం పాలు అవుతుండటంతో అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అభిమానులు అయితే హద్దు మీరి విమర్శలు చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కుమార్తె వామికను అత్యాచారం చేస్తామని బెదిరించారు. ఈ విషయంలో విరాట్‌ కోహ్లీకి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మద్దతుగా నిలిచారు. ‘డియర్‌ విరాట్‌.. కొంతమంది మనుషులు పూర్తిగా ద్వేషంతో నిండిపోయి ఉంటారు. ఎందుకంటే వారికి ఎవ్వరూ ప్రేమను పంచరు. వాళ్లను క్షమించు. జట్టును రక్షించుకో’ అంటూ ట్వీట్‌ చేశారు.

అంతకుముందు పాకిస్థాన్‌పై భారత్ ఓడిపోవడంతో అభిమానులు బౌలర్ మహ్మద్ షమీని టార్గెట్ చేశారు. దీంతో కోహ్లీ రంగంలోకి దిగి షమీకి మద్దతుగా నిలిచి కౌంటర్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కొందరు అభిమానులు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కుమార్తె వామికను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు దిగారు. ఇలా చేయడాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు ఖండించారు. ఆటగాళ్లు రాణించకపోతే… వారి కుటుంబసభ్యులను దూషించడం, వారిని టార్గెట్ చేయడం మంచిది కాదని హితవు పలికారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా విరాట్ కోహ్లీకి అండగా నిలవడంతో పలువురు అభినందిస్తున్నారు.

Read Also: హీరో నందమూరి బాలకృష్ణకు ఆపరేషన్

Exit mobile version