NTV Telugu Site icon

KE Kumar: జాతీయ కారు రేసింగ్‌లో విషాదం.. రేసర్ కుమార్ మృతి

Ke Kumar

Ke Kumar

KE Kumar: తమిళనాడులో జరుగుతున్న జాతీయ కార్‌ రేసింగ్‌ ఛాంపియన్ షిప్‌లో విషాదం చోటు చేసుకొంది. వెటరన్‌ రేసర్‌ కేఈ కుమార్‌ (59) కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. రెండో రౌండ్ పోటీల్లో భాగంగా మద్రాస్ అంతర్జాతీయ సర్క్యూట్‌లో ఈ ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన కేఈ కుమార్ కారు మరో పోటీదారుడి వాహనాన్ని ఢీకొట్టి ట్రాక్‌ నుంచి పక్కకు వెళ్లి బోల్తా పడింది. వెంటనే రేసును నిలిపివేసిన నిర్వాహకులు కారులో నుంచి కేఈ కుమార్‌ను బయటకు తీశారు. అక్కడే ఏర్పాటు చేసిన వైద్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించిన తర్వాత స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే కుమార్‌ను కాపాడేందుకు వైద్యుల బృందం ప్రయత్నించినా తీవ్ర గాయాల కారణంగా అతడు మరణించాడు.

Read Also: Steve Jobs @ Apple: ‘యాపిల్‌’ ఉన్నంత కాలం.. యాదికొస్తూనే ఉంటాడు..

కాగా ఇదో దురదృష్టకరమైన ఘటన అని ఎమ్ఎమ్ఎస్‌సీ ఎఫ్ఎమ్‌సీఐ మీట్ ఛైర్మన్ విక్కీ చంధోక్ వెల్లడించారు. కేఈ కుమార్ అనుభవజ్ఞుడైన రేసర్ అని.. ఓ స్నేహితుడిగా, పోటీదారుడిగా కొన్ని దశాబ్దాల నుంచి అతడు తనకు తెలుసన్నారు. కుమార్ మరణం రేసింగ్ కుటుంబానికి బాధ కలిగిస్తోందన్నారు. ఈ ప్రమాద ఘటనపై విచారణ జరుపుతామని తెలిపారు. కాగా కుమార్ గౌరవార్ధం మిగిలిన రేసులను రద్దు చేస్తున్నట్లు మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ (ఎమ్ఎమ్ఎస్‌సీ) తెలిపింది. జీవిత కాల సభ్యుడు మరణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది.