PV Sindhu Not Participating In World Championship Due To Leg Injury: బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్ 2022లో బంగారు పతకం సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధు.. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు దూరం అవ్వాల్సి వచ్చింది. ఇందుకు కారణం.. ఆమెకు కాలికి గాయం అవ్వడమే! కామన్‌వెల్త్ గేమ్స్‌లో భాగంగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లోనే సింధుకి గాయమైంది. అయితే తన కోచ్, ఫిజియో & ట్రైనర్ సహాయంతో.. ఆ టోర్నీలో తన ప్రయాణం కొనసాగించింది. చివరికి ఫైనల్‌లో నెగ్గి.. భారత్‌కు బంగార పతకం తీసుకొచ్చింది. కానీ, ఇప్పుడు ఆ గాయం ప్రభావం ఎక్కువ కావడంతో బెడ్‌కి పరిమితం కావాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలోనే పివి సింధు ఎమోషనల్ ట్వీట్ చేసింది. ‘కామన్‌వెల్త్ క్రీడల్లో బంగారం పతకం సాధించానన్న ఆనందంలో ఉన్న నన్ను.. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కి దూరమవుతున్నానన్న దుఃఖం కలచివేస్తోంది. కామన్‌వెల్త్ క్రీడల్లో భాగంగా క్వార్టర్ ఫైనల్స్‌లో నా కాలికి గాయమైంది. అయితే.. నా కోచ్, ఫిజియో & ట్రైనర్ సహాయంతో, అలాగే గెలుపే లక్ష్యంగా ఆ క్రీడల్లో సత్తా చాటగలిగాను. ఆ కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఆడుతున్న క్రమంలోనే ఆ గాయం తీవ్రంగా బాధపెట్టింది. భరించలేకపోయా. ఇప్పుడది మరింత తీవ్రమైంది. హైదరాబాద్‌కి వచ్చిన వెంటనే ఎమ్మారై చేయించుకున్నాను. నా ఎడమ కాలికి స్ట్రెస్ ఫ్రాక్చర్ అయ్యిందని డాక్టర్లు కన్ఫమ్ చేశారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి తప్పదని సూచించారు. ఈ కారణంగానే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనలేక పోతున్నా. కొన్ని వారాల తర్వాత నేను తిరిగి ట్రైనింగ్‌లో పాల్గొంటా’ అంటూ పివి సింధు ట్వీట్ చేసింది.
— Pvsindhu (@Pvsindhu1) August 13, 2022
