PV Sindhu History: పీవీ సింధు సరికొత్త చరిత్ర.. తొలి భారత షట్లర్‌గా అరుదైన ఘనత!

  • ప్రపంచ బ్యాడ్మింటన్ వేదికపై పీవీ సింధు సత్తా
  • జపాన్‌ ఓపెన్‌ 2026 విజేతగా సింధు
  • తొలి భారత షట్లర్‌గా తెలుగు తేజం సింధు ఘనత
Pv Sindhu Japan Open 2026

Pv Sindhu Japan Open 2026

PV Sindhu Becomes First Indian to Win Japan Open 2026 Title: తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి ప్రపంచ బ్యాడ్మింటన్ వేదికపై తన సత్తా చాటింది. ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్ సూపర్-750 టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆతిథ్య జపాన్‌కు చెందిన ప్రపంచ ఛాంపియన్ అకానే యమగుచిపై సింధు వరుస సెట్లలో 21-17, 21-17 తేడాతో విజయం సాధించింది. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత మహిళా షట్లర్‌గా పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఆదివారం జరిగిన ఫైనల్‌లో పీవీ సింధు అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. తొలి పాయింట్ నుంచే దూకుడుగా ఆడిన ఆమె.. చిరకాల ప్రత్యర్థి యమగుచికి పెద్దగా అవకాశాలు ఇవ్వకుండా 21-17, 21-17 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. మొత్తం 50 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రతి గేమ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగినప్పటికీ.. కీలక సమయంలో సింధు తన అనుభవాన్ని ప్రదర్శించి మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో పీవీ సింధు కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. జపాన్ ఓపెన్ టైటిల్‌ను గెలిచిన తొలి భారతీయ షట్లర్‌గా చరిత్రలో నిలిచింది.

అంతేకాదు 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచిన తర్వాత పీవీ సింధుకు ఇదే తొలి ప్రధాన అంతర్జాతీయ టైటిల్ కావడం విశేషం. దీంతో దాదాపు ఏడు సంవత్సరాలుగా కొనసాగుతున్న టైటిల్ నిరీక్షణకు ముగింపు పలికింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో 2024 డిసెంబర్‌లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిన తర్వాత సింధుకు ఇదే తొలి ట్రోఫీ. ఇటీవల ఫామ్‌పై వచ్చిన విమర్శలకు ఈ విజయంతో సింధు గట్టి సమాధానం చెప్పింది. జపాన్ ఓపెన్‌లో చారిత్రాత్మక విజయంతో సింధు మరోసారి భారత క్రీడాభిమానులను గర్వపడేలా చేసింది. ఆమె విజయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.