ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉషా భర్త వెంగళిల్ శ్రీనివాసన్ (67) కన్నుమూశారు. గురువారం అర్ధరాత్రి అయన తుదిశ్వాస విడిచారు. కొజికోడ్ జిల్లాలోని తిక్కోడి పెరుమల్పురంలో ఉన్న నివాసంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో శ్రీనివాసన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే శ్రీనివాసన్‌ను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మరణించారని వైద్యులు తెలిపారు.
Also Read: Quinton de Kock Century: రీఎంట్రీలో రెచ్చిపోతున్న డికాక్.. కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్!
ఈ విషాద ఘటన జరిగిన సమయంలో పీటీ ఉషా ఇంట్లో లేరు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉన్న పీటీ ఉషా కేరళలోని ఇంటికి తిరిగి వచ్చారు. పొన్నానికి చెందిన శ్రీనివాసన్ కబడ్డీ ఆటగాడు, సిఐఎస్ఎఫ్‌లో అధికారి. పొన్నానిలోని వెంగళి తారవాడుకు చెందిన నారాయణన్, సరోజిని దంపతుల కుమారుడు శ్రీనివాసన్. కేంద్ర పరిశ్రమల భద్రతా దళంలో డిప్యూటీ ఎస్పీగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. 1991లో తన దూరపు బంధువు పీటీ ఉషాను ఆయన వివాహం చేసుకున్నారు. శ్రీనివాసన్–ఉషా దంపతులకు ఉజ్జ్వల్ విఘ్నేష్ కుమారుడు ఉన్నాడు. శ్రీనివాసన్ మృతితో క్రీడా, రాజకీయ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది.
