Sri Lanka vs Pakistan: పాక్ బ్యాట్స్మన్ వరల్డ్ రికార్డ్.. 93 ఏళ్ల తర్వాత..

Abdullah Shafique

Abdullah Shafique

Pakistan Opener Abdullah Shafique Creates World Record: శ్రీలంక, పాకిస్తాన్ మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాక్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే! ఈ విజయంలో పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ కీలక పాత్ర పోషించాడు. 160 పరుగులతో అజేయంగా నిలిచిన అతడు.. చివరివరకు క్రీజులో నిలిచి, తన జట్టుని గెలిపించాడు. ఈ క్రమంలో అతడు తన పేరిట రెండు అరుదైన రికార్డుల్ని లిఖించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో షఫీక్ ఏకంగా 524 నిమిషాల పాటు క్రీజులో ఉన్నాడు. దీంతో, టెస్ట్ క్రికెట్ చరిత్రలో చేజింగ్ సమయంలో ఎక్కువసేపు క్రీజులో నిలిచిన తొలి బ్యాట్స్మన్‌గా అతడు చరిత్రపుటలకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ శ్రీలంక ఆటగాడు అరవింద డి సిల్వా పేరిట ఉండేది. 1998లో జింబాబ్వేపై చేజింగ్‌లో అతడు 460 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు 524 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి, ఆ రికార్డ్‌ని తుడిచిపెట్టేశాడు షఫీక్. అంతేకాదు.. అత్యధిక బంతుల్ని ఎదుర్కొని, 93 ఏళ్ల తర్వాత ఓ అరుదైన ఫీట్ సాధించాడు షఫీక్. 1928-29లో మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్మన్ సట్‌క్లిప్ 462 బంతులు ఎదుర్కొని 135 పరుగులు సాధించాడు. తన జట్టుని గెలిపించాడు.

×
×
Ad

ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత 408 బంతులు ఎదుర్కొన్న షఫీక్.. ఛేజింగ్‌లో అన్ని బంతులు ఆడి, జట్టుని విజయతీరాలకు చేర్చిన రెండో బ్యాట్స్మన్‌గా నిలిచాడు. దాదాపు 93 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రికార్డును షఫీక్ సాధించడం విశేషం. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో చూసుకుంటే.. నాలుగో ఇన్నింగ్స్‌లో 400 పైగా బంతులను ఎదుర్కొన్న ఐదో బ్యాటర్‌గా షఫీక్ నిలిచాడు. తొలి నాలుగు స్థానాల్లో హెర్బర్ట్ సట్‌క్లిఫ్, సునీల్ గవాస్కర్, మైక్ అథర్టన్, బాబర్ ఆజాం ఉన్నారు.