NTV Telugu Site icon

ODI World Cup 2023: భారత్ గడ్డపై మెగా టోర్నీ.. ప్రపంచ్‌కప్‌ 2023 నుంచి పాకిస్తాన్‌ ఔట్‌?

Pakistan Odi

Pakistan Odi

PCB Chief Najam Sethi says Pakistan Govt will take decision on 2023 ODI World Cup: ఎన్నో చర్చల అనంతరం ఆసియా కప్ 2023 నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సిద్దమవుతోంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు ఉపఖండ దేశాల మధ్య ఆసియా కప్ జరగనుంది. పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌లోనే ఈ టోర్నీ జరగనుంది. ఆసియాకప్‌ 2023కి సంబంధించి ప్రసార హక్కులను బ్రాడ్‌కాస్ట్‌ సంస్థ ‘ స్టార్‌స్పోర్ట్స్‌’ కొనుగోలు చేసింది. దీంతో భారత్ గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌ 2023 (ODI World Cup 2023)లో కూడా పాకిస్తాన్ ఆడుతుందని అంతా భావించారు. అయితే పీసీబీ ఛైర్మన్‌ నజం సేథీ తాజాగా ఓ బాంబ్ పేల్చాడు. పాక్ ప్రభుత్వం అనుమతి ఇస్తేనే భారత్‌లో పర్యటిస్తామని చెప్పాడు.

ఏసీసీ హైబ్రిడ్ మోడల్‌ను ప్రకటించిన ఒక రోజు తర్వాత పీసీబీ ఛైర్మన్‌ నజామ్ సేథి (Najam Sethi) పాకిస్థాన్‌లో మీడియాతో మాట్లాడాడు. ‘వన్డే ప్రపంచకప్‌ 2023కి సంబందించి ఎలాంటి నిర్ణయమైనా బీసీసీఐ, పీసీబీ సొంతంగా తీసుకోలేవు. ఇరు దేశాల ప్రభుత్వాలు మాత్రమే నిర్ణయం తీసుకుంటాయి. భారత్‌ మా మా దేశానికి రావాలన్నా.. మేం అక్కడికి వెళ్లాలన్నా మా ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. అందుకే అహ్మదాబాద్‌లో మీరు ఆడతారా? అనే ప్రశ్నను మమ్మల్ని అడిగేందుకు ఎవరికీ ఆస్కారం లేదు. గతంలో మేం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి ఇదే చెప్పాం’ అని అన్నాడు.

Also Read: Cruel Mother: నువ్వసలు తల్లివేనా.. కాలేనూనెలో నాలుగు రోజుల చిన్నారి వేళ్లు పెడతావా ఛీ..

‘భద్రతను పరిశీలించి పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి ఇస్తే.. ఎలాంటి అభ్యంతరం లేకుండా భారత్‌కు వెళ్లి వన్డే ప్రపంచకప్‌ 2023 ఆడతాం. ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే భారత గడ్డపై ఎలా ఆడగలం?. ముందుగా ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వడంపైనే మేం భారత్ వెళ్లాలా? వద్దా? అనేది నిర్ణయం ఉంటుంది. అనంతరం వేదికలపై ఓ నిర్ణయానికొస్తాం’ అని పీసీబీ ఛైర్మన్‌ నజామ్ సేథి స్పష్టం చేశాడు. హైబ్రిడ్‌ మోడల్‌లో ఆసియా కప్‌ను నిర్వహించడానికి బీసీసీఐ సహా మిగతా ఉపఖండ దేశాల బోర్డులు ఆమోద ముద్ర వేశాయి. పాక్‌లో నాలుగు మ్యాచ్‌లు జరగనుండగా.. శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్ ఆడే మ్యాచ్‌లు మాత్రం లంకలోనే జరుగుతాయి.

ఆసియా కప్‌ 2023 ఆతిథ్య హక్కులు పాకిస్థాన్‌ వద్ద ఉన్నాయి. ఈ టోర్నమెంట్ కోసం పాకిస్తాన్‌కు వెళ్లడానికి భారత్ నిరాకరించింది. ఆ తర్వాత హైబ్రిడ్ మోడల్‌కు అన్ని దేశాలు ఒప్పుకున్నాయి. ఐసీసీ వన్డే ప్రపంచకప్ ముసాయిదా షెడ్యూల్‌ను పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని పీసీబీని కోరింది. అయితే భారత్‌కు పాకిస్తాన్ జట్టుని పంపాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వానికి మరింత సమయం కావాలని పాక్ బోర్డు చీఫ్ అన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Also Read: Assam Floods: అస్సాంను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వరదలు.. నిరాశ్రయులైన 34 వేల మంది

Show comments