NZ vs IND 4th ODI: బే ఓవల్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ భారీ స్కోరు సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ముందు 334 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్ (125; 108 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లు), టిమ్ సీఫర్ట్ (58; 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫిన్ అలెన్ (41: 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. భారత బౌలర్లలో అకిబ్ నబీ 2, గుర్నూర్ బ్రార్ 2, అక్షర్ పటేల్ 2 వికెట్స్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా విల్ యంగ్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న అతడు.. 108 బంతుల్లో 14 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 125 పరుగులు చేశాడు. అనంతరం నమన్ ధీర్ బౌలింగ్‌లో కుమార్ కుశాగ్రకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ టిమ్ సీఫర్ట్ కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 48 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేశాడు. ఫిన్ అలెన్ 30 బంతుల్లో 41 పరుగులు సాధించాడు. మిచెల్ బ్రేస్‌వెల్ 15, మిచెల్ సాంట్నర్ 24, క్రిస్టియన్ క్లార్క్ 22 పరుగులు చేశారు. చివర్లో కైల్ జేమీసన్ అజేయంగా 19 పరుగులు చేసి జట్టు స్కోరును 330 దాటించాడు.
భారత బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు, గుర్నూర్ బ్రార్ రెండు, ఔకిబ్ నబీ రెండు వికెట్లు తీశారు. అర్ష్‌దీప్ సింగ్, నమన్ ధీర్ తలో వికెట్ సాధించారు. కుల్దీప్ యాదవ్ వికెట్ 8 ఓవర్లలో 73 పరుగులు సమర్పించుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఔకిబ్ నబీ వేసిన ఆఖరి ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. చివరి బంతికి రెండో పరుగు కోసం ప్రయత్నించిన మాథ్యూ ఫిషర్ (1) రనౌట్ అయ్యాడు. లాంగాఫ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ బంతిని నేరుగా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు విసరగా.. అతడు వికెట్లను పడగొట్టి ఫిషర్‌ను పెవిలియన్‌కు పంపించాడు. దీంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సరిగ్గా 50 ఓవర్లలో 333 పరుగులకు ముగిసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత్ 334 పరుగులు చేయాల్సి ఉంది.

