T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై న్యూజిలాండ్ 65 పరుగుల తేడాతో గెలుపొందింది. కివీస్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక ఏ దశలోనూ టార్గెట్‌ను ఛేదించేలా కనిపించలేదు. వరుస వికెట్లు కోల్పోతూ 19.2 ఓవర్లలో 102 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రీలంక బ్యాటర్లలో రాజపక్స 34, శనక 35 పరుగులు చేశారు. వీరిద్దరూ తప్ప మిగతా ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ 4 వికెట్లతో చెలరేగాడు. అతడు కెరీర్ బెస్ట్ (13/4) నమోదు చేశాడు. సోధీ, సాంట్నర్ తలో రెండు వికెట్లు తీశారు. సౌధీ, ఫెర్గూసన్ తలో వికెట్ సాధించారు. ఈ విజయంతో గ్రూప్-1లో న్యూజిలాండ్ దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. అటు శ్రీలంక సెమీస్ అవకాశాలు మాత్రం సన్నగిల్లాయి. ఆ జట్టు సెమీస్ చేరాలంటే అద్భుతాలు జరగాల్సి ఉంటుంది.
Read Also: IND Vs SA: కేఎల్ రాహుల్ స్థానంలో పంత్.. టీమిండియా కోచ్ క్లారిటీ
అంతకుముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత రాణించిన శ్రీలంక బౌలర్లు అనంతరం పట్టు విడిచారు. దీంతో న్యూజిలాండ్ కోలుకుని మంచి స్కోరు చేయగలిగింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ సెంచరీతో చెలరేగాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో బ్రెండన్ మెకల్లమ్ తర్వాత సెంచరీ చేసిన న్యూజిలాండ్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఫిలిప్స్‌ను మొదట్లోనే అవుట్ చేసి ఉంటే శ్రీలంక పరిస్థితి మరోలా ఉండేది. కానీ క్యాచ్‌లు డ్రాప్ చేసి తగిన మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ప్రదర్శన చూశాక ఇటీవల ఆసియా కప్ టైటిల్ గెలిచిన టీమ్ ఇదేనా అని అభిమానులు పెదవి విరుస్తున్నారు.
