NTV Telugu Site icon

Ruturaj Gaikwad: రుతురాజ్ తీరుపై నెటిజన్ల విమర్శలు .. ఎందుకో తెలుసా!

Ruturaj Gaikwad Gesture

Ruturaj Gaikwad Gesture

భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం రాత్రి వ్యవహరించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. వర్షం కారణంగా రద్దయిన ఈ పోరులో గైక్వాడ్.. మైదాన సిబ్బంది ఒకరితో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. అక్కడ దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. వర్షం పడే సమయంలో డగౌట్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్‌తో సెల్ఫీ కోసం గ్రౌండ్స్‌మ్యాన్ ప్రయత్నించాడు. కానీ.. గ్రౌండ్స్‌మ్యాన్ తనకి క్లోజ్‌గా రావడంతో అసహనం వ్యక్తం చేసిన గైక్వాడ్ అతడ్ని పక్కకి తోసి.. దూరంగా ఉండాలని సూచించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రుతురాజ్ తీరు సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.

మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 3.3 ఓవర్లు ముగిసే సమయానికి 28/2తో నిలిచిన దశలో మొదలైన వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్‌ని అంపైర్లు రద్దు చేశారు. వాస్తవానికి భారత ఓపెనర్లు మైదానంలో అడుగుపెట్టగానే తొలుత వర్షం మొదలైంది. కానీ.. కొద్దిసేపటికే తగ్గిపోగా.. మైదానం సిబ్బంది 10-15 నిమిషాల్లోనే మైదానాన్ని ఆటకి సిద్ధం చేశారు. వర్షం పడే సమయంలో డగౌట్‌లో కూర్చుని ఉన్న తన వద్దకి వచ్చిన గ్రౌండ్స్‌మెన్‌‌తో గైక్వాడ్ కాస్త దూరంగా ఉండాలని సైగలు చేస్తూ అసహనం వ్యక్తం చేసినట్లు టీవీలో కనిపించింది. దీంతో అది చూసిన క్రికెట్‌ ప్రేమికులు టీమ్‌ఇండియా బ్యాట్స్‌మన్‌ తీరును తప్పుబడుతున్నారు. గైక్వాడ్‌ ఇలా వ్యవహరించడం ద్వారా ఇతరుల పట్ల వివక్ష చూపుతున్నాడని విమర్శలు చేస్తున్నారు.

Show comments