Site icon NTV Telugu

MS Dhoni: ధోనీ బ్యాట్ కొరకడం వెనుక అసలు కారణమిది!

Dhoni Eating Bat

Dhoni Eating Bat

క్రికెట్ ప్రియులు, ముఖ్యంగా ధోనీ అభిమానులు.. క్రీజులోకి వెళ్ళడానికి ముందు ధోనీ బ్యాట్ కొరకడాన్ని చాలా సందర్భాల్లో గమనించే ఉంటారు. అంతెందుకు.. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్‌కి రావడానికి ముందు తన బ్యాట్ కొరుకుతూ కెమెరాకి చిక్కాడు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలెందుకు ధోనీ ఇలా చేస్తాడని గతంలో చాలామంది సందేహాలు వ్యక్తం చేసినా, సమాధానం దొరకలేదు.

అయితే, ఇన్నాళ్ళ తర్వాత మాజీ క్రికెటర్ అమిత్ మిశ్రా రూపంలో ఆ సమాధానం దొరికింది. ‘‘క్రీజులోకి వెళ్ళడానికి ముందు ధోనీ తన బ్యాట్‌ని ఎందుకు కొరుకుతాడని మీరు ఆలోచిస్తున్నారా? తన బ్యాట్‌పై ఏదైనా టేప్‌ ఉండే అవకాశం ఉంటుందన్న అనుమానంతో, దానిని తొలగించడానికే ధోనీ నోటితో కొరుకుతుంటాడు. ప్రతీసారి బ్యాటింగ్‌కు వెళ్లడానికి ముందు బ్యాట్‌పై ఎలాంటి టేప్‌ లేదా థ్రెడ్‌ ఉండకూడదని ధోని అనుకుంటాడు. కావాలంటే, మీరెప్పుడైనా ధోనీ బ్యాట్‌ను గమనించండి.. ఎలాంటి టేప్‌, థ్రెడ్‌ కనిపించవు’’ అంటూ ట్విటర్ మాధ్యమంగా అమిత్ మిశ్రా చెప్పుకొచ్చాడు. అదన్నమాట సంగతి!

కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సీఎస్కే భారీ విజయం సొంతం చేసుకుంది. ఇందులో ధోనీ మరోసారి ఫినిషర్‌గా రాణించాడు. ధనాధన్ ధోనీ ఇన్నింగ్స్‌తో సీఎస్కే 200 పరుగులు దాటింది. ఆ తర్వాత లక్ష్య చేధనలో ఘోరంగా విఫలమైన ఢిల్లీ, 117 పరుగులకే కుప్పకూలింది. అయినప్పటికీ, సీఎస్కేకి ప్లేఆఫ్‌ అవకాశాలు దాదాపు లేనట్లే. 11 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచిన ఆ జట్టు, పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది.

Exit mobile version