AUS vs ZIM: టీ20 ప్రపంచకప్‌లో సంచలనం.. ఆస్ట్రేలియాపై జింబాంబ్వే విజయం!

Australia Vs Zimbabwe

Australia Vs Zimbabwe

భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ 2026లో సంచలనం నమోదయింది. మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై పసికూన జింబాంబ్వే విజయం సాధించింది. 170 పరుగుల లక్ష ఛేదనలో ఆసీస్ 19.3 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో జింబాంబ్వే 23 పరుగుల తేడాతో గెలిచింది. జింబాంబ్వే బౌలర్లలో ముజారబానీ 4 వికెట్స్ పడగొట్టగా.. బ్రాడ్ ఎవాన్స్ 3 వికెట్లతో సత్తాచాటాడు. మాట్ రెన్షా (65) ఆసీస్ తరఫున హాఫ్ సెంచరీ బాదాడు.

గ్రూప్-Bలో భాగంగా కొలంబోలో ఆస్ట్రేలియా, జింబాంబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాంబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 169 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రియాన్‌ బెన్నెట్‌ (64 నాటౌట్; 56 బంతుల్లో, 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. తాదివనాషే మారుమణి (35, 21 బంతుల్లో, 7 ఫోర్లు), ర్యాన్ బర్ల్ (35; 30 బంతుల్లో 4 ఫోర్లు), సికిందర్‌ రాజా (25 నాటౌట్; 13 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మార్కస్‌ స్టోయినిస్‌, కామెరూన్‌ గ్రీన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ఛేదనలో ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. జోష్ ఇంగ్లిస్ (8), కామెరూన్‌ గ్రీన్‌ (0), టీమ్ డేవిడ్ (0) విఫలమయ్యారు. ట్రావిస్ హెడ్ (17) కూడా నిరాశపరిచాడు. ముజారబానీ, ఎవాన్స్ కలిసి ఆసీస్ టాప్ ఆర్డర్ బ్యాటర్లను ఎత్తేశారు. ఈ సమయంలో మాట్ రెన్‌షా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (31) జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ నెమ్మదిగా ఆడడంతో చేయాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. మ్యాక్స్‌వెల్, రెన్‌షా అవుట్ అయ్యాక.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో ఆసీస్ ఓడక తప్పలేదు. ముజర్బానీ (4/17) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. అతడితో పాటు ఇవాన్స్, మసకద్జ, బర్ల్ కూడా బంతితో రాణించారు.