అమెరికాలోని యుజీన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత లాంగ్ జంప్ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ నిరాశ పరిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన భారత తొలి మేల్ లాంగ్ జంపర్‌గా చరిత్ర సృష్టించిన శ్రీ శంకర్ ఫైనల్‌గా పతకం మాత్రం అందుకోలేకపోయాడు. పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో శ్రీశంకర్ ఏడో స్థానంతో సరిపెట్టాడు. కనీసం క్వాలిఫికేషన్ రౌండ్‌లో అందుకున్న దూరాన్ని కూడా ఫైనల్లో అతడు చేరుకోలేకపోయాడు. ఫైనల్లో అన్ని ప్రయత్నాల్లో అత్యధికంగా 7.96 మీటర్ల దూరం మాత్రమే దూకగలిగాడు. తన తొలి ప్రయత్నంలోనే ఈ దూరం దూకిన తను తర్వాత అంతకంటే తక్కువ మార్కుకే సరిపెట్టాడు. దాంతో ఏడో స్థానంలో నిలిచిన శ్రీశంకర్ ప్రపంచ అథ్లెటిక్స్‌లో పతకం గెలిచిన భారత తొలి పురుష క్రీడాకారుడిగా నిలిచే అవకాశాన్ని కోల్పోయాడు.
Read Also: Singapore Open: చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. తొలిసారి సింగపూర్ ఓపెన్ టైటిల్ కైవసం
శనివారం జరిగిన క్వాలిఫికేషన్స్ రౌండ్‌లో 8 మీటర్ల జంప్ చేసిన శ్రీశంకర్ పురుషుల లాంగ్‌జంప్ విభాగంలో ఫైనల్‌కు అర్హత సాధించాడు. తద్వారా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ లాంగ్‌జంప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి పురుష అథ్లెట్‌గా శ్రీశంకర్ రికార్డులకెక్కాడు. మరోవైపు పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ హీట్స్‌లో భారత ఆటగాడు ఎం.పి. జబిర్ 50.76 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని ఏడో స్థానంలో నిలిచాడు. దాంతో అతడు ఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయాడు.
