MS Dhoni Gets Madras High Court Notice: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీకి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2013 ఐపీఎల్ బెట్టింగ్ కేసుకు సంబంధించిన రూ.100 కోట్ల పరువు నష్టం దావాలో ఈ పరిణామం చోటుచేసుకుంది. తన వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ చేయాలని కోరుతూ మాజీ ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ధోనీ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 29కి వాయిదా వేసింది.
2013 ఐపీఎల్ బెట్టింగ్ కేసుపై ఓ టీవీ చర్చా కార్యక్రమంలో తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఎంఎస్ ధోనీ గతంలో సంపత్ కుమార్‌పై ఆరోపణలు చేశారు. ఈ మేరకు 2014లో మద్రాసు హైకోర్టులో రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో తన వాదనలను వినిపించేందుకు ధోనీ వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సి ఉంది. ధోనీ వాంగ్మూలాన్ని నమోదు చేసే ప్రక్రియలో పారదర్శకత ఉండేలా వీడియో రికార్డింగ్ చేయాలని సంపత్ కుమార్ కోర్టును కోరారు. రికార్డ్ చేసిన వాంగ్మూలాన్ని ఎలాంటి మార్పులు చేయకుండా తనకు అందించాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఈ రికార్డింగ్ కోర్టు ప్రాంగణంలో లేదా ప్రభుత్వ భవనాల్లోనే జరగాలని అభ్యర్థించారు.
ఎంఎస్ ధోనీ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు హైకోర్టు ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించింది. తాజాగా సంపత్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం.. ధోనీ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. వాంగ్మూలం రికార్డింగ్ ఫైవ్‌స్టార్ హోటల్‌లో జరిగితే వచ్చే ఇబ్బంది ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. రికార్డింగ్ ఎక్కడ జరగాలనే అంశంపై పిటిషన్‌లో చేసిన అభ్యర్థన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కేసులో తదుపరి విచారణ అక్టోబర్ 29న జరగనుంది. ధోనీ అఫిడవిట్, వాంగ్మూలం రికార్డింగ్‌కు సంబంధించిన అంశాలపై కోర్టు తదుపరి విచారణలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

