NTV Telugu Site icon

Siraj: నెంబర్‌వన్ బౌలర్‌గా సిరాజ్..ర్యాంకింగ్స్‌లో హైదరాబాదీ పేసర్ జోరు

Siraj1

Siraj1

మహ్మద్ సిరాజ్..హైదరాబాద్ గల్లీ క్రికెట్‌ ఆడిన ఈ పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తం వినిపిస్తోంది. బుమ్రా గాయంతో జట్టుకు దూరమవగా అందివచ్చిన అవకాశాల్ని ఒడిసిపట్టుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు. టీమ్‌లో నమ్మదగిన బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్‌ బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రాణించిన సిరాజ్.. ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. వన్డే బౌలర్ల విభాగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని ఔరా అనిపించాడు.

శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో తొమ్మిది వికెట్లు సాధించిన సిరాజ్..న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. దీంతో ప్రస్తుతం 729 పాయింట్లతో అగ్రస్థానానికి చేరాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ 727 పాయింట్లతో రెండో ప్లేస్‌కు పడిపోయాడు. మంగళవారం న్యూజిలాండ్‌ను మూడు వన్డేల సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసిన తర్వాత టీమిండియా కూడా నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఇక తాజా ర్యాంకుల్లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆరోస్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అతడు ఏకంగా 360 పరుగులు చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడు ఏకంగా 20 స్థానాలు ఎగబాకి 6వ ర్యాంక్ కు చేరుకున్నాడు. మరోవైపు కివీస్ సిరీస్‌లో పెద్దగా రాణించని విరాట్ కోహ్లీ ఏడో స్థానానికి పడిపోయాడు. చివరి వన్డేలో సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. రెండు స్థానాలు ఎగబాకి 8వ ర్యాంక్ అందుకున్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ టాప్‌లో కొనసాగుతున్నాడు..